ఘనంగా ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం
ఘనంగా ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో డాక్టర్ ముస్కు మధుసూదన్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ క్యాంపస్‌లో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం గురువారం ఘనంగా ముగిసింది.
ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు నెల రోజుల పాటు ఈ శిబిరాన్ని నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేజీ అడ్వైజర్ పి. సత్యనారాయణ రాజు, విశిష్ట అతిథిగా వైస్ చైర్మన్ పి.సి. శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా పి. సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో పరిపూర్ణమైన ఎదుగుదల సాధ్యమవుతుందన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తిత్వ సామర్థ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.
అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందజేశారు. నెల రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో విద్యార్థులకు స్కేటింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ వంటి వివిధ క్రీడల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వ్యాయామ అధ్యాపకులు జడ ప్రసాదరావు, విజయరాణి, వంశీ, సహాయక శిక్షకులు, శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

