సంబరాల మహానాడు..

సంబరాల మహానాడు..
విజయవాడ పార్లమెంట్ పరిధిలో తొలి రోజు ఘన విజయం
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంట్ పరిధిలో మహానాడు తొలి రోజు కార్యకర్తల కోలాహలంతో ఘన విజయంగా ముగిసింది. ఎంపీ కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన చేస్తూ ఒక్కరోజే నాలుగు నియోజకవర్గాల్లోని 11 చోట్ల వర్చువల్ మహానాడులో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
తూర్పు, సెంట్రల్, పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులు బొప్పన భవ కుమార్, సెంట్రల్లో ప్రభుత్వ విప్ బోండా ఉమ, మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి మహానాడు కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని, ఆయన ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈసారి మహానాడు అత్యంత ప్రత్యేకమని, ప్రతి క్లస్టర్ స్థాయిలో నిర్వహించడం చరిత్రాత్మకమని తెలిపారు. కార్యకర్తలే పార్టీ బలమని, వారి వల్లే టీడీపీ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలే అధినేతగా ముందుకు సాగాలన్నదే చంద్రబాబు, లోకేష్ నిర్ణయమని తెలిపారు.
మహానాడు ద్వారా తీసుకునే తీర్మానాలను త్వరలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. “మహానాడు అంటే పసుపు సైనికుల పండుగ” అని అభివర్ణించారు.
విజయవాడ పర్యటనలో కొండ ప్రాంత ప్రజలకు జీవో నెం.30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ త్వరలో పూర్తవుతుందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో తూర్పు, సెంట్రల్, పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల పరిశీలకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
