విజయవాడలో ఇంధన సెగ, వైసీపీ నిరసన..

విజయవాడలో ఇంధన సెగ, వైసీపీ నిరసన..
ప్రభుత్వ వైఫల్యం..
కృత్రిమ కొరతపై అనుమానం
సోషల్ మీడియాకే పరిమితమైన పాలన
పోలీసు నిర్బంధాలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు
రాష్ట్రవ్యాప్త ఉద్యమం
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గత మూడు రోజులుగా ఇంధనం దొరక్క వాహనదారులు అల్లాడిపోతుంటే.. ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వారు ధ్వజమెత్తారు. విజయవాడలో మూడు రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ సంక్షోభం బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ కట్టారన్నారు.
ఇంధన నిల్వలను ముందస్తుగా అంచనా వేయడంలో, సరఫరాను క్రమబద్ధీకరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఒకవైపు సామాన్యుడు చుక్క పెట్రోల్ కోసం రోడ్లపై గంటల తరబడి వేచి చూస్తుంటే, మంత్రులు మాత్రం విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం సిగ్గుచేటు అన్నారు. అటు బుడమేరు వరద బాధితులను ఆదుకోవడంలో, ఇటు నిత్యావసరాల పంపిణీలో వైఫల్యం.. ఇప్పుడు ఇంధన కొరతతో ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ, చెన్నై, ముంబై నగరాల్లో లేని ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు తలెత్తిందో సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో చమురు కంపెనీలతో సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందా? లేక కృత్రిమ కొరత సృష్టించి మాఫియాకు కొమ్ముకాస్తున్నారా? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. సివిల్ సప్లైస్ మంత్రి క్షేత్రస్థాయి సమస్యలను గాలికొదిలేసి, కేవలం సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులతో అడ్డుకోవాలని చూడటం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రజల కష్టాలను చూస్తూ ఊరుకోబోమని, తక్షణమే పెట్రోల్, డీజిల్ నిల్వలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య కేవలం విజయవాడకే పరిమితం కాదని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన చమురు కంపెనీలతో మాట్లాడి ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే, ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు.
సామాన్యుడి రవాణా సౌకర్యాన్ని దెబ్బతీస్తున్న ఈ సంక్షోభానికి ముగింపు ఎప్పుడో చూడాలన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు అవుతూ శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ ఇంచార్జి పసుపులేటి ఏసు తదితరులు పాల్గొన్నారు.
