Telangana Schools | ప్రతి పాఠశాలలో బాలల రక్షణ అధికారిణి నియామకం

Telangana Schools | ప్రతి పాఠశాలలో బాలల రక్షణ అధికారిణి నియామకం
Telangana Schools | ప్రతి పాఠశాలలో బాలల రక్షణ అధికారిణి నియామకం
వేధింపులు, బాల్య వివాహాలకు విద్యాశాఖ చెక్
చట్టాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన తరగతులు
విద్యార్థుల భద్రతకు పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థ
Telangana Schools | హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ఇకపై భరోసా లభించనుంది. వేధింపులతో లోలోన కుమిలిపోతూ ఫిర్యాదు చేసేందుకు భయపడే విద్యార్థుల కోసం విద్యాశాఖ అభయహస్తాన్ని అందించనుంది. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ హైస్కూల్లో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని బాలల రక్షణ అధికారిణి (చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – సీపీఓ)గా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ (టీఎస్ఎల్ఎస్ఏ)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ సరికొత్త రక్షణ వ్యవస్థ అమల్లోకి రానుంది.
తద్వారా మహిళా ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా, విద్యార్థుల రక్షణ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తారు. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ వంటి ప్రమాదాల నుంచి విద్యార్థులను రక్షించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. వేధింపులకు గురయ్యే విద్యార్థులు తమ సమస్యను నేరుగా సీపీఓకు చెప్పుకోవచ్చు. బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే, వారికి అవసరమైన న్యాయసాయం అందించేలా ప్రత్యేక ఫార్మాట్లను విద్యాశాఖ సిద్ధం చేసింది.
చట్టాలపై వారానికొక పీరియడ్..
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలో వారానికి ఒక పీరియడ్‌ను కేటాయించాలి. రాజ్యాంగం గురించి అవగాహనతో పాటు ఫోక్సో వంటి కీలక చట్టాల గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించనున్నారు. ప్రతి స్కూల్లో లీగల్ లిటరసీ క్లబ్లు లేదా చైల్డ్ రైట్స్ క్లబ్లను ఏర్పాటు చేసి సెమినార్లు, పోటీలు నిర్వహిస్తారు.
పటిష్టమైన పర్యవేక్షణ..
ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో డీఈఓ, మండల స్థాయిలో ఎంఈఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మూడు నెలలకొకసారి జిల్లా చట్టపరమైన సేవల సంస్థ సమన్వయంతో సమీక్షిస్తారు. నమోదైన కేసుల పరిష్కారం, విద్యార్థుల రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహణకు అందుబాటులో ఉన్న వనరులతో పాటు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను వినియోగించుకోవాలని డైరెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
