బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి

  • ఎంపీ ఆర్. కృష్ణయ్య

మోత్కూరు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై అమలవుతున్న క్రిమిలేయర్ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

మంగళవారం మోత్కూరులోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బీసీ ఉద్యోగుల సదస్సులో ఆయన మాట్లాడారు.

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. దీనికి ఎలాంటి చట్టపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.

మండల్ కమిషన్‌తో పాటు నాచియప్పన్ పార్లమెంటరీ కమిటీ కూడా బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు కూడా జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వవచ్చని తీర్పు ఇచ్చిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. విద్య, ఉద్యోగ నియామకాలలో బీసీ రిజర్వేషన్లకు మాత్రమే క్రిమిలేయర్ నిబంధన అమలు చేయడం వివక్షకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలు, ఎన్‌సీసీ వంటి ఇతర వర్గాలకు లేని క్రిమిలేయర్ నిబంధనను బీసీలకే ఎందుకు వర్తింపజేస్తున్నారని ప్రశ్నించారు.

రిజర్వేషన్ల ఉద్దేశ్యం కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదని, పాలనలో భాగస్వామ్యం, సామాజిక హోదా పెంపు కూడా ముఖ్యమని తెలిపారు.

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీసీ విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, పారిశ్రామిక రంగంలోనూ 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ముత్యం వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, యాదగిరి, ఎడ్ల మహాలింగం, కలిమేల నర్సింహ, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.