“అమ్మా… మీరు క్షేమంగా ఉన్నారా?”

“అమ్మా… మీరు క్షేమంగా ఉన్నారా?”

ధర్మవరంలో మహిళల మనసు గెలుచుకున్న జిల్లా ఎస్పీ ఫీల్డ్ విజిట్

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని కాలనీల్లో మంగళవారం ప్రత్యేక దృశ్యం కనిపించింది. సాధారణంగా పోలీస్ అధికారులను చూసి భయపడే మహిళలు ఆ రోజు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించారు. కారణం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి “అమ్మా… మీరు క్షేమంగా ఉన్నారా?” అని ఆప్యాయంగా పలకరించడం.

పోలీసింగ్ అంటే కేవలం నేరస్తులను పట్టుకోవడం మాత్రమే కాదని, ప్రజల్లో భరోసా కల్పించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ధర్మవరంలో జరిగిన ఈ ఫీల్డ్ విజిట్ చర్చనీయాంశంగా మారింది.

ఎస్పీ తిక్కస్వామి కాలనీ, శివనగర్, నేసేపేట, మాధవ్ నగర్, దర్గా సర్కిల్, లోనీ కోట, చెరువు కట్ట, ఎల్‌సీకే పురం, ఎంజీ కాలనీ ప్రాంతాలను సందర్శించారు. ప్రతి ప్రాంతంలో మహిళలు, వృద్ధులు, యువతతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో భద్రత పరిస్థితులు, మద్యం సేవించి అల్లర్లు సృష్టించే ఘటనలు, వేధింపుల సమస్యలపై ఆరా తీశారు.

“ఎలాంటి భయం పడకండి… సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ రక్షణ కోసం మేమున్నాం” అని ఎస్పీ భరోసా ఇచ్చారు. గృహహింస, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు వంటి సమస్యలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఎస్పీ ఆప్యాయతతో మాట్లాడడంతో మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా వివరించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెరగడంతో భద్రతాభావం పెరిగిందని పలువురు తెలిపారు. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్నారని వారు పేర్కొన్నారు.

ఒక వృద్ధ మహిళ మాట్లాడుతూ, “మా దగ్గరకు పెద్ద అధికారులు రావడం చాలా అరుదు. మా సమస్యలు విని ధైర్యం చెప్పడం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది” అని భావోద్వేగానికి గురయ్యారు. మరో యువతి మాట్లాడుతూ, “పోలీసులు ఇలా దగ్గరగా మాట్లాడితే భయం తగ్గుతుంది. ఏ సమస్య వచ్చినా చెప్పొచ్చనే నమ్మకం కలుగుతోంది” అని పేర్కొన్నారు.

ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు బలోపేతం అవుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, ఎస్‌ఐలు వీరేష్, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply