వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే
జగన్ రాజకీయాలు అరాచక, హింసాత్మక ధోరణులతో నిండినవే : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు.
మంగళవారం నంద్యాలలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. “మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమి చేశావ్ జగన్?” అని ప్రశ్నించారు.

వైకాపా పాలనలో అనేక గ్రామాల్లో రాజకీయ హత్యలు జరిగాయని, వాటికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అవసరమైతే వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ సీఎం జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు.
జగన్ హయాంలో ఎంతమంది రౌడీషీటర్లను పెంచి పోషించారో ప్రజలకు తెలుసన్నారు. వైకాపా అరాచకాలను భరించలేకనే ప్రజలు గత ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ప్రజావేదిక’ను కూల్చేస్తానని ప్రకటించడంలోనే జగన్‌లోని క్రూరత్వం బయటపడిందని మండిపడ్డారు. ప్రధానమంత్రికే లేని స్థాయిలో ఇనుప కంచెల భద్రత ఏర్పాటు చేసుకోవడం ఆయనలోని అభద్రతాభావానికి నిదర్శనమన్నారు.
రాజా రెడ్డిలో ఉన్న క్రూర స్వభావాలు జగన్‌కు వచ్చాయని, ఇప్పటికీ బెదిరించే ధోరణిలోనే మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగాన్ని తగ్గించేందుకు కృషి చేస్తుంటే, జగన్ మాత్రం పెట్టుబడిదారులను భయపెడుతున్నారని ఆరోపించారు.
17 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గురించి ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వంలో జరిగిన కుటుంబ హత్యలపైనా విచారణ జరపలేకపోయారని ప్రశ్నించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని పేర్కొంటూ, హత్య రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన జగన్‌కు టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు. పత్రికా ప్రతినిధులపై కూడా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ సొంత బాబాయిని చంపిన ఘనత జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు, అరాచకాలకు జగన్ కుటుంబమే కారణమన్నారు. జగన్ తీరు ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో వైకాపాకు సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
