వీడియోలు చూస్తూ.. దొంగతనాలు చేస్తూ..

వీడియోలు చూస్తూ.. దొంగతనాలు చేస్తూ..
- జల్సాల కోసం చైన్ స్నాచర్లుగా మారిన ఇంజినీర్లు
- అంతర్ జిల్లా చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్
- ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు
- రూ.25 లక్షల బంగారం, రెండు వాహనాలు స్వాధీనం
- 130 గ్రాముల ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, మాస్కులు సీజ్
- తిరుపతి, నెల్లూరులో 9 చైన్ స్నాచింగ్ కేసుల వెల్లడి
- మహిళలనే లక్ష్యంగా చేసుకున్న నిందితులు
- ఆన్‌లైన్ బెట్టింగ్, విలాసాలే నేరాలకు కారణం
- సోషల్ మీడియా వీడియోలు చూసి నేరాల పథకం
తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : ఉన్నత చదువులు చదివి విలాసవంతమైన జీవితం, దురలవాట్ల కోసం చైన్ స్నాచర్లుగా మారిన ముగ్గురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను తిరుపతి సీసీఎస్, వెస్ట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి నగరంతో పాటు నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసులు పత్రికాముఖంగా వెల్లడించారు. వివరాలు.. ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల దర్యాప్తు కోసం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆర్ల శ్రీనివాసులు నేతృత్వంలో, డీఎస్పీ భక్తవత్సలం పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. మే 25 ఉదయం అలిపిరి – చెర్లోపల్లి రోడ్డులోని సైన్స్ సెంటర్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది.
అరెస్టయిన నిందితులు నెల్లూరు జిల్లా తూర్పు ఎర్రబల్లి గ్రామానికి చెందిన శీలం నాగార్జున రెడ్డి, నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండకు చెందిన నల్లగొండ వెంకట మురళి, నెల్లూరు సిటీ పప్పుల వీధికి చెందిన లింగాలదిన్నే విష్ణువర్ధన్ రెడ్డిలుగా గుర్తించారు. నాగార్జున రెడ్డి అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేశాడు. నల్లగొండ వెంకట మురళి డిగ్రీ పూర్తి చేశాడు. లింగాలదిన్నే విష్ణువర్ధన్ రెడ్డి బెంగళూరులో సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వంటి దురలవాట్లకు బానిసలై ఉద్యోగాలు కోల్పోయి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుండి రూ.25 లక్షల విలువ చేసే సుమారు 130 గ్రాముల బంగారు ఆభరణాలు, యమహా ఎఫ్‌జెడ్ బైక్, హోండా ఆక్టివా స్కూటీ, మొబైల్ ఫోన్లు, హెల్మెట్లు, క్యాపులు, మాస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలి, పోలీసులకు ఎలా చిక్కకుండా ఉండాలనే వీడియోలు వీక్షించి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బైక్‌ల నెంబర్ ప్లేట్లు తొలగించి, తెల్లవారుజామున ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లు చేసినట్లు తేలింది.
విచారణలో నిందితులు తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో మొత్తం 9 చైన్ స్నాచింగ్ కేసులకు పాల్పడినట్లు అంగీకరించారు. నెల్లూరు బాలాజీ నగర్, వేదయపాలెం, హరినాథపురం ప్రాంతాలతో పాటు తిరుపతి వెస్ట్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లిన ఘటనల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను తిరుపతిలో విక్రయించి మరోసారి చైన్ స్నాచింగ్‌కు కుట్ర పన్నుతున్న సమయంలో పోలీసులు సకాలంలో స్పందించి నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీ భక్తవత్సలం నేతృత్వంలోని తిరుపతి వెస్ట్, క్రైమ్ పోలీస్ అధికారులు, ప్రత్యేక బృందాల సిబ్బందిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించి రివార్డులు ప్రకటించారు.
