3 MLAs | తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

3 MLAs | తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
3 MLAs | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాలు ఎన్నికల అనంతరం మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కలిసి పోటీ చేసిన కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడుతుండగా.. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏఐఏడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార టీవీకే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇటీవల తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసినట్లు సమాచారం. అలాగే మంత్రి ఆధవ్ అర్జున్‌తో కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో కే మరగతం కుమారవేల్ టీవీకే అభ్యర్థిపై 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఎస్ జయకుమార్, సత్యభామ డీఎంకే అభ్యర్థులపై గెలిచారు. సత్యభామ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది.
ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ ముగ్గురు సహా 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వీరంతా త్వరలో టీవీకేలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ ఈ చేరికలు జరిగితే టీవీకేకు పూర్తి మెజారిటీ లభించి ప్రభుత్వం మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐఏడీఎంకేలో రెబల్ నేతలకు ఎస్పీ వేలుమణి, షణ్ముగం నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. వీరు ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
