లారీల నిల్వపై మంత్రి ఆగ్రహం.. క్షేత్రస్థాయిలో తనిఖీలు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఆకస్మికంగా రైస్ మిల్లులను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్లు, చందుబట్లలోని శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్‌ను సందర్శించారు.
వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్‌లోడింగ్ ప్రక్రియలను పరిశీలించిన మంత్రి, మిల్లుల వద్ద పెద్ద సంఖ్యలో ధాన్యం లోడుతో లారీలు రోజుల తరబడి నిలిచిపోవడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సమయానికి అన్‌లోడ్ చేయకపోవడం వల్ల వారికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

రైస్ మిల్లుల యాజమాన్యాలను నేరుగా ప్రశ్నించిన మంత్రి, ధాన్యం అన్‌లోడింగ్‌లో ఎందుకు జాప్యం జరుగుతోందని వివరణ కోరారు. రైతుల లారీలు రోజుల తరబడి నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే ప్రయత్నాలు జరిగితే సహించబోమని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి కూడా మంత్రి కీలక సూచనలు చేశారు. రైస్ మిల్లులు, గోదాముల వద్ద ప్రతి లారీ సమయానికి అన్‌లోడ్ అయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, రైతులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించి అన్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియలను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడా నిల్వలుగా పేరుకుపోకుండా వెంటనే మిల్లులకు తరలించేలా అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
మిల్లుల వద్ద లారీల అన్‌లోడింగ్‌లో జాప్యం జరగకుండా తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ధాన్యం లారీల కదలికలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
తాలు, తరుగు అంశాల్లో పారదర్శకత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేస్తామని, అక్రమాలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైస్ మిల్లుల వద్ద నిల్వలు, అన్‌లోడింగ్ ప్రక్రియపై రోజువారీ సమీక్ష నిర్వహించి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఎస్పీ శ్రీనివాసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
