మార్కెట్ చైర్మన్ అవినీతిపై చర్చకు రావాలి

  • భూ వివాదాలు మొక్కజొన్న కొనుగోళ్లలో భారీగా అవినీతి
  • ఎమ్మెల్యే మార్కెట్ చైర్మన్ టాక్సీ విధిస్తున్నారట..
  • సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు రావాలి
  • ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి
  • బి ఆర్ఎస్ నేతల సవాల్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని, భూ సెటిల్‌మెంట్ల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ ఆరోపణలను నిరూపించేందుకు సోమవారం నాగర్‌కర్నూల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చకు రావాలని ఆయనకు సవాల్ విసిరారు.

ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ శ్రీశైలం, మాజీ గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు, నాయకులు బొడ్డు రమణ, చంద్రశేఖర్‌రెడ్డి, నాగార్జున మాట్లాడారు.

మొక్కజొన్న కొనుగోళ్లలో క్వింటాలుకు రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేశారని, పెద్దముద్దునూరు గ్రామంలో రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. గన్నీ బ్యాగుల నిధుల్లో కూడా అవకతవకలకు పాల్పడేందుకు కుట్ర జరుగుతోందని, సీఈఓలను బెదిరిస్తూ తనకు అనుకూలంగా ఖాతాల్లో నగదు జమ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.

కారు కొనుగోలు, భూ వివాదాల పరిష్కారం పేరుతో మంతటి, తాడూరు, గుడ్లనర్వ, బిజినపల్లి తదితర ప్రాంతాల్లో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో “రేవంత్ రెడ్డి ట్యాక్స్”, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో “రాజేష్ రెడ్డి ట్యాక్స్”, మార్కెట్ చైర్మన్ “రమణారావు ట్యాక్స్” పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.

తాము చేసిన ఆరోపణలు నిరాధారమైతే బహిరంగంగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవినీతి లేకుంటే మార్కెట్ చైర్మన్ చర్చకు రావాలని శ్రీశైలం సవాల్ చేశారు. మార్కెట్ చైర్మన్‌పై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్పందించి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

పెద్దముద్దునూరులో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్‌కు వారం రోజుల క్రితమే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతోందని, అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పీఏసీఎస్ చైర్మన్లు, కార్యదర్శులు రైతులకు రావాల్సిన గన్నీ బ్యాగుల చెల్లింపులు, లారీ అద్దెలు వారం రోజుల్లో చెల్లించాలని, లేకపోతే పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రభుత్వం సకాలంలో మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పంటను విక్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడమే రైతుల నష్టానికి కారణమని బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, బొడ్డు రమణ విమర్శించారు.

పెద్దముద్దునూరుకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు నాగార్జున మాట్లాడుతూ, ఒక్క పెద్దముద్దునూరు గ్రామంలోనే మొక్కజొన్న కొనుగోళ్లలో రూ.44 లక్షల అవినీతి జరిగిందని, దీనిని ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, మార్కెట్ చైర్మన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీలు శ్రీనివాస్ గౌడ్, నరసింహారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, మాధవరెడ్డి, కౌన్సిలర్ పాండు, పులేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.