Government schools Telangana | ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మూల్యాంకన విధానం

Government schools Telangana | ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త మూల్యాంకన విధానం
Government schools Telangana | విద్యార్థుల అసలు సామర్థ్యంపై ఆందోళన
ఇతర పాఠశాలల టీచర్లతో పరీక్షల నిర్వహణ
పారదర్శకత కోసం బాహ్య మూల్యాంకనం
బోధనా పద్ధతుల మెరుగుదలకే విద్యాశాఖ లక్ష్యం
Government schools Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రభుత్వ బడుల్లో ఇకపై స్థానిక టీచర్లు వేసే మార్కులపైనే ఆధారపడకుండా, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఎక్స్టర్నల్ అసెస్మెంట్ (బాహ్య మూల్యాంకనం) విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.
ప్రస్తుతం పదో తరగతి ఫలితాల్లో ఏటా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదవుతున్నా, విద్యార్థుల వాస్తవ అభ్యసన సామర్థ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదికల ప్రకారం, ఎనిమిదో తరగతి చదువుతున్న చాలామంది విద్యార్థులు రెండో తరగతి పాఠాలను కూడా ధారాళంగా చదవలేకపోతున్నారని తేలింది. ప్రాథమిక గణిత సమస్యలను సాధించడంలోనూ విఫలమవుతున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో ఆయా పాఠశాలల టీచర్లే పరీక్షలు నిర్వహించి మార్కులు వేస్తుండటంతో, విద్యార్థుల అసలు లోపాలు బయటపడటం లేదని అధికారులు భావిస్తున్నారు.
బాహ్య మూల్యాంకనం ఎలా సాగుతుందంటే..
విద్యార్థుల ప్రతిభను నిష్పాక్షికంగా అంచనా వేసేందుకు ఈ కొత్త విధానంలో కఠినమైన నిబంధనలు ఉండనున్నాయి. పరీక్షలు నిర్వహించే సమయంలో సంబంధిత పాఠశాల టీచర్లకు ఎటువంటి సంబంధం ఉండదు. బయటి టీచర్ల పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది.
ఇతర పాఠశాలల టీచర్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి పరీక్షల పర్యవేక్షణకు పంపుతారు. పరీక్షల తేదీలు, సబ్జెక్టుల వివరాలను రహస్యంగా ఉంచుతారు. ఒక పాఠశాల విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను మరో పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయిస్తారు. తద్వారా పారదర్శకత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఫలితాలను సబ్జెక్టుల వారీగా ఆన్లైన్లో నమోదు చేసి, విద్యార్థులు ఎక్కడ వెనుకబడ్డారో విశ్లేషిస్తారు.
లోపాలను సరిదిద్దేందుకే ఈ నిర్ణయం..
ఈ విధానంలో విద్యార్థుల వెనుకబాటును గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏయే సబ్జెక్టుల్లో విద్యార్థులు బలహీనంగా ఉన్నారో గుర్తించి, అక్కడ బోధనా పద్ధతులను మెరుగుపరచడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు అంటున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ఈ ప్రతిపాదనను త్వరలోనే ప్రభుత్వ అనుమతికి పంపనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాహ్య మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టనున్నారు.
