Telangana maize procurement | మొక్కజొన్న కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం

Telangana maize procurement | మొక్కజొన్న కొనుగోళ్లలో చెల్లింపుల జాప్యం
Telangana maize procurement | రూ. 3,084 కోట్ల బకాయిలతో రైతుల ఆవేదన
గోదాముల కొరతతో నిల్వ సమస్యలు
గన్నీలు, రవాణా బిల్లుల కోసం కాంట్రాక్టర్ల నిరసన
కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా ముందంజ
Telangana maize procurement | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించిన మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా సాగుతున్నప్పటికీ, రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసినా, రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు దాటినా రూ. 3,084 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో రైతులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్ల కోసం నేరుగా నిధులు విడుదల చేయకుండా అప్పులపైనే ఆధారపడుతున్నట్టు సమాచారం.
మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ. 4,172.94 కోట్ల బ్యాంక్ గ్యారంటీని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, రుణం పూర్తిగా విడుదల కాకపోవడంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఎన్సీడీసీ నుంచి రుణానికి ఆమోదం లభించినట్టు తెలిసినా, ఆ నిధులు మార్క్‌ఫెడ్‌కు చేరేందుకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రుణం వస్తేనే రైతులకు పైసలు అన్న పరిస్థితి నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 1,867 కోట్లు కేటాయించింది.
అప్పులు తీర్చలేక అవస్థలు
రైతులు ఇప్పటికే తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కొందరు అప్పు చేసి పంట పండించగా, ఇప్పుడు చెల్లింపులు రాక వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నారు. కొనుగోళ్ల కోసం గోస, పైసల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు మార్కెట్లలోనే రోజులు గడపాల్సి వస్తోంది. మరోవైపు గన్నీ సంచుల సరఫరాదారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు సరఫరా చేసిన గన్నీలు, వాహనాల బిల్లులు విడుదల చేయాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతకాలం మేమే భారం భరించాలి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
మక్కల నిల్వలో కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి సరిపడ గోదాములు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15.53 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 12.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 12.85 లక్షల టన్నుల్లో దాదాపు 11 లక్షల టన్నులను మాత్రమే గోదాములకు తరలించగా, మరో 1.85 లక్షల టన్నులు ఇంకా కేంద్రాల వద్దనే నిల్వ ఉన్నాయి.
కొనుగోళ్లలో ఖమ్మం ముందంజ
కొనుగోళ్లలో ఖమ్మం జిల్లా ముందంజలో ఉంది. అక్కడ ఇప్పటికే 2.54 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశారు. నాగర్‌కర్నూల్‌లో 1.55 లక్షల టన్నులు, వరంగల్‌లో 1.11 లక్షల టన్నులు, నిర్మల్ జిల్లాలో 1.05 లక్షల టన్నుల కొనుగోళ్లు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, గన్నీల కొరత, రవాణా సమస్యలు, నిల్వల లోపం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ యాసంగి సీజన్లో తెలంగాణలో మొత్తం 43.18 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తుండగా, అందులో 21.59 లక్షల టన్నుల వరకు కొనుగోళ్లు జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
మొదటగా జిల్లాల వారీగా ప్రభుత్వం 14.89 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని మాత్రమే నిర్ణయించింది. తాజాగా 6.53 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరుతో కొనుగోళ్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. రైతులకు వెంటనే బకాయిలు చెల్లించి, కొనుగోళ్ల గడువును పొడిగించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
