జనగణనను పూర్తి చేయాలి

జనగణనను పూర్తి చేయాలి

  • కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో ఆంధ్రప్రభ: పశ్చిమ గోదావరి జిల్లాలో జనగణన, గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనగణన గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని దుర్గాపురం ప్రాంతంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గృహ జాబితా నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించి, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు , సూపర్వైజర్లతో మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలు, నమోదు విధానం, ప్రజల స్పందన తదితర అంశాలపై ఆరా తీశారు.

గృహాల వివరాలు నమోదు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని, ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. గృహ జాబితా లెక్కింపు కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు మర్యాదపూర్వకంగా వ్యవహరించి, అవసరమైన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, ఆర్డిఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ రావి రాంబాబు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది, సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply