కాషాయం వెనుక రాజకీయ రగడ..? భూమన వ్యాఖ్యలు కలకలం

కాషాయం వెనుక రాజకీయ రగడ..? భూమన వ్యాఖ్యలు కలకలం

టీటీడీ వ్యవహారాలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

తిరుపతి, ఆంధ్రప్రభ: కాషాయం ముసుగులో కొందరు తనపై రాజకీయ దాడులు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

ఆదివారం తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడులు జరుగుతున్నాయని అన్నారు.

టీడీపీ కార్యకర్తలు కాషాయం వస్త్రాలు ధరించి తన ఇంటి ముట్టడికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి టీడీపీ ఎన్‌టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ అట్లూరి నారాయణరావు నాయకత్వం వహించారని విమర్శించారు. “పేరుకు కాషాయం, వెనుక అంతా కసాయితనం” అని వ్యాఖ్యానించారు.

టీటీడీ శ్రీవాణి టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్ల అమ్మకాలపై తాను ప్రశ్నించడంతోనే తనపై దాడులు జరుగుతున్నాయని భూమన అన్నారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అపవిత్ర ఘటనలు జరిగాయని ఆరోపించారు. కొండపై నాన్‌వెజ్ బిర్యానీ, మద్యం బాటిళ్లు దొరికాయని పేర్కొన్నారు.

మూడు వేల కోట్ల విలువైన స్థలాన్ని ఓబెరాయ్ హోటల్‌కు కేటాయించడంపై స్వామీజీలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిజమైన పీఠాధిపతులు, జగద్గురువుల మాటలకు గౌరవం ఇస్తానని, రాజకీయ ప్రయోజనాల కోసం కాషాయం ధరించిన వారిని మాత్రం ప్రశ్నిస్తానని భూమన స్పష్టం చేశారు.