fake2pistols | మేడ్చల్‌లో కలకలం.. రెస్టారెంట్ ఉద్యోగి వెనుక దేశ వ్యతిరేక లింకులా?

fake2pistols | మేడ్చల్‌లో కలకలం.. రెస్టారెంట్ ఉద్యోగి వెనుక దేశ వ్యతిరేక లింకులా?

fake2pistols | ఇన్‌స్టాగ్రామ్ పరిచయాల వెనుక అనుమానాస్పద నెట్‌వర్క్
మెరుపు దాడిలో నకిలీ పిస్టల్స్ స్వాధీనం
మొబైల్ ఫోన్‌లో కీలక డిజిటల్ ఆధారాలు
ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ముఠాల కోణంలో దర్యాప్తు
మరెవరెవరితో సంబంధాలు?.. పోలీసుల లోతైన విచారణ

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్‌లో ఓ సాధారణ రెస్టారెంట్ ఉద్యోగి వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే కాకుండా స్థానికంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బయటకు సాధారణ వ్యక్తిలా కనిపించిన యువకుడు.. అంతర్జాతీయ నేర ముఠాలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

దేశ భద్రతకు విఘాతం కలిగించేలా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న నేర ముఠాలతో సంబంధాలు పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని మేడ్చల్ పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు నకిలీ పిస్టల్స్‌తో పాటు కీలక ఆధారాలు ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

fake2pistols
fake2pistols

మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌ (రెస్టారెంట్)లో పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా అతని ప్రవర్తన, సోషల్ మీడియా కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. జయీద్ ఖాన్‌కు పాక్‌ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకోవాలనే ఆసక్తి పెరిగింది. ఆ ముఠా ద్వారా ఎలాగైనా ఆయుధాలు సమకూర్చుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా అతడు నిరంతరం అనుమానాస్పద వ్యక్తులతో టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే శక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా.. నిందితుడు ఆ మార్గంలోనే ముందుకు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ముబారక్ రెస్టారెంట్‌లో నిందితుడు ఉన్నాడనే పక్కా సమాచారంతో మేడ్చల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. అక్కడే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. సాక్షుల సమక్షంలో రెండు నకిలీ పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అసలు షాక్ అక్కడితో ఆగలేదు.
నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్ స్క్రీన్‌షాట్లు గుర్తించినట్లు తెలిపారు. దేశ వ్యతిరేక ముఠాలతో జరిగిన సంభాషణలకు సంబంధించిన కొన్ని కీలక డిజిటల్ ఆధారాలు లభించినట్లు సమాచారం.

పోలీసుల అనుమానం ప్రకారం.. ఈ నకిలీ పిస్టల్స్‌ను బెదిరింపులు లేదా ఇతర నేర కార్యకలాపాల కోసం వినియోగించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా?
ఇంకా ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు?
సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయాలు ఎంత దూరం వెళ్లాయి?

అనే కోణాల్లో మేడ్చల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

click here for more news

click here to read క్షణాల్లో బూడిదైన రెండు ఇళ్లు.. ఏమైంది అక్కడ..?