అతి వేగంతో ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
- ప్రాణాపాయ స్థితిలో ఆటో డ్రైవర్
కమలాపూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వంగపల్లి గ్రామం వైపు నుండి మర్రిపల్లిగూడెం వైపు వెళ్తున్న ఆటోను మరిపెళ్లి గూడెం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టగా ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది.
జమ్మికుంట మండలం మల్యాల గ్రామానికి చెందిన ఉడుత ఓదెలు అలియాస్ నితిన్( 25) అనే ఆటో డ్రైవర్ కు ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు. అధిక ఇసుకలోడుతో అధిక స్పీడ్ తో ట్రాక్టర్ డీ కొనడంతో ఆటో డ్రైవర్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
కేసు కాకుండా మొదలైన ప్రయత్నాలు
ఈ ప్రమాద విషయంలో ఎలాంటి కేసు కాకుండా ఇసుక ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణప్రయస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్ ఓదెలు తరపు కుటుంబ సభ్యులకు ప్రమాదానికి గురైన ఇసుక ట్రాక్టర్ యజమానికి మధ్యన ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు రాయబారాన్ని నడిపిస్తుండగా అందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు సమాచారం ఉంది.
