Rs 433 Crore Burden : పెట్రో వాత Andhra Prabha Top Story

Rs 433 Crore Burden : పెట్రో వాత Andhra Prabha Top Story

  • ఉమ్మడి కృష్ణా కుయ్యో మొర్రో
  • వార్షిక భారం రూ.433 కోట్లు పైనే
  • ముచ్చటగా మూడోసారీ
  • పెట్రోల్ పై రూ 4.98 ల భారం..
  • డీజిల్ పై రూ 4.86ల భారం..
  • 8 రోజుల్లో 3 సార్లు షాక్
  • డీజిల్ సెంచరీతో రవాణా రంగం కుదేలు..
  • ద్రవ్యోల్బణం దూకుడు

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో)

పశ్చిమాసియా సంక్షోభం… ఇరాన్ పరిణామాలతో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో ఉత్కంఠ… దానికి తోడు వరుసగా పెరుగుతున్న బ్రెంట్ క్రూడ్ ధరలు… ఈ ప్రభావం ఇప్పుడు సామాన్యుడి జేబుపై నేరుగా చిల్లిపడేలా చేస్తుంది. దేశవ్యాప్తంగా చమురు మార్కెటింగ్ సంస్థలు కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలపై భారీ ఆర్థిక భారం పడుతోంది. మూడు రోజులకు ఒకసారి షాక్ ఇస్తున్న ఆయిల్ కంపెనీలు 8 రోజుల్లో మూడుసార్లు సుమారులు ఐదు రూపాయల అదనపు భారాన్ని సామాన్యులపై వేసింది.

Rs 433 Crore Burden : నాలుగేళ్ల తర్వాత మళ్లీ వాత

Rs 433 Crore Burden

మే 15న నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా లీటరుకు రూ.3 పెంపు ప్రకటించిన చమురు సంస్థలు, మే 19న మరో 90 పైసలు, మే 23న మళ్లీ 87–91 పైసల వరకు ధరలు పెంచాయి. దీంతో విజయవాడలో పెట్రోల్ ధర రూ.114.72కు, డీజిల్ ధర రూ.102.43కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మే 14 కు ముందు పెట్రోలు రూ 109.74 పైసలు ఉండగా డీజిల్ రూ 97.57 పైసలుగా ఉంది. మే 14న విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.109.74 ఉండగా, తాజా పెంపులతో అది రూ.114.72కు చేరింది. అంటే కేవలం ఎనిమిది రోజుల్లోనే లీటరుకు రూ.4.98 పెరిగింది. అదే విధంగా డీజిల్ ధర రూ.97.57 నుంచి రూ.102.43కు ఎగబాకి రూ.4.86 అదనపు భారం మోపింది.

Rs 433 Crore Burden : పశ్చిమాసియా ఉద్రిక్తత శాపం

ఈ పెంపు వెనుక ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరా అంతరాయం భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలు 100 డాలర్లకు పైగా చేరడమేనని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. క్షీణిస్తున్న రూపాయి మారక విలువ కూడా తోడు కావడంతో ధరలు బగ్గుమంటున్నాయి.

Rs 433 Crore Burden : రోజుకు రూ.1.20 కోట్ల భారం..

Rs 433 Crore Burden

ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా సుమారు 350 పెట్రోల్ బంకులు ఉండగా, రోజుకు దాదాపు 10.50 లక్షల లీటర్ల పెట్రోల్, 14 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతోంది. తాజా పెంపుతో పెట్రోల్ వినియోగదారులపై రోజుకు రూ.68.04 లక్షల అదనపు భారం పడుతుండగా, డీజిల్ వినియోగదారులపై రూ.52.29 లక్షల అదనపు భారం పడుతోంది. మొత్తంగా జిల్లాలో ప్రతిరోజూ రూ.1.20 కోట్లకు పైగా అదనపు డబ్బు ప్రజల జేబుల నుంచి బయటకు వెళ్తోంది. ఈ లెక్కన నెలకు పెట్రోల్ వినియోగదారులపై రూ.20.41 కోట్ల భారం, డీజిల్ వినియోగదారులపై రూ.15.68 కోట్ల భారం పడుతోంది. మొత్తం కలిపి ఒక్క నెలలోనే రూ.36.09 కోట్ల అదనపు భారంగా మారింది. ఏడాది కాలానికి ఇది రూ.433 కోట్లకు పైగా చేరనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Rs 433 Crore Burden : మధ్యతరగతి పై తీవ్ర ప్రభావం…

ఇంధన ధరల పెరుగుదలతో ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు ఉపయోగించే కుటుంబాల నెలవారీ ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నెలకు కేవలం ఇంధనం కోసమే అదనంగా రూ.800 నుంచి రూ.1,200 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతం పెరగడం లేదు… కానీ ప్రతి వారం పెట్రోల్ ధర పెరుగుతోంది” అంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Rs 433 Crore Burden : రవాణా రంగం కుదేలు…

Rs 433 Crore Burden

డీజిల్ ధర రూ.102 దాటడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. లారీలు, గూడ్స్ వాహనాల ట్రిప్ ఖర్చు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్‌పోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. రవాణా రంగానికి కేంద్ర బిందువుగా ఉన్న విజయవాడ నుండి వేల సంఖ్యలో లారీలు సరుకు రవాణా చేస్తుండగా అత్యధిక ప్రభావం విజయవాడ నుండే కనిపిస్తోంది. దీని ప్రభావం నేరుగా మార్కెట్‌పై పడనుంది. కూరగాయలు, పాలు, కిరాణా సామాగ్రి, నిర్మాణ సామగ్రి వంటి నిత్యావసరాల ధరలు త్వరలోనే మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.

Rs 433 Crore Burden : ఆర్టీసీ పై అదనపు భారం

Rs 433 Crore Burden

డీజిల్ ధరల పెంపు ప్రభావం ప్రభుత్వ రవాణా సంస్థలపైనా పడుతోంది. ఏపీఎస్ ఆర్టీసీ పై రోజుకు దాదాపు రూ.30 లక్షల అదనపు భారం పడుతుందని రవాణా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నెలకు ఇది రూ.10 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది మరో పెద్ద దెబ్బగా మారనుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Rs 433 Crore Burden : ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గండం..

Rs 433 Crore Burden

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఛార్జీలకే నడపాల్సి రావడంతో ఆదాయం తగ్గిపోతోందని చెబుతున్నారు. రోజంతా తిరిగినా చేతిలో మిగిలేది తక్కువే” అంటూ డ్రైవర్లు వాపోతున్నారు. ఏపీలో వ్యాట్ కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న పరిస్థితులలో ధరలు తగ్గించేందుకు నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ALSO READ : Ap Cm Serious : గొడ్డలి పార్టీ నెవర్​ ఎగైన్​ Andhra Prabha Top Story

Leave a Reply