కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు..

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా ప్రముఖులు కూడా పుష్కర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆదివారం కాళేశ్వరానికి చేరుకుని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.
తనతో పాటు వచ్చిన మిత్రులు, అనుచరులతో కలిసి సరస్వతి నదిలో వేద మంత్రోచ్చారణల నడుమ పవిత్ర స్నానాలు నిర్వహించిన మల్లారెడ్డి అనంతరం భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత పవిత్రమైనవని, ఈ పుణ్యకాలంలో స్నానాలు ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.
పుష్కర ఘాట్‌ల వద్దకు చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. పుష్కరాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘాట్‌ల వద్ద భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలతో ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో కొంతసేపు భక్తులతో కలిసి గడిపిన ఆయన అందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు. మల్లారెడ్డి పుష్కర స్నానానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు. దీంతో పుష్కర ఘాట్‌లు, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
