Panic | ప్రజల భద్రతకే ప్రాధాన్యం
Panic | ప్రజల భద్రతకే ప్రాధాన్యం
Panic | వీధి కుక్కల బెడదతో భయాందోళనలో ప్రజలు
రద్దీ ప్రాంతాల్లో కుక్కలను వెంటనే తరలించాలని ఆదేశం
పిల్లలపై దాడులు ఆందోళనకరం: సుప్రీంకోర్టు
యానిమల్ బర్త్ కంట్రోల్ అమలుపై అసంతృప్తి
ప్రజల భద్రత vs జంతు సంరక్షణ.. సమతుల్యత ఎలా?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉదయం స్కూల్‌కి వెళ్లే చిన్నారి… చేతిలో టిఫిన్ బ్యాగ్, తల్లి చేతిని గట్టిగా పట్టుకుని భయంగా రోడ్డుపై నడుస్తోంది. మరో వైపు ఆస్పత్రి వద్ద మందులు తెచ్చుకుని బయటకు వస్తున్న వృద్ధుడు… ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు వైపు చూసి ఆగిపోతున్నాడు. బస్‌స్టాండ్ వద్ద ప్రయాణికులు సంచులు పట్టుకుని పరుగులు తీస్తుంటే… కొన్నిచోట్ల కుక్కల గుంపులు భయాందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని అనేక పట్టణాలు, నగరాల్లో ఇప్పుడు ఇది సాధారణ దృశ్యం అయిపోయింది.
ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో… వీధి కుక్కల నియంత్రణ అంశంపై సుప్రీంకోర్టు కఠిన వైఖరి అవలంబించింది. ప్రజల ప్రాణ భద్రత కంటే ముఖ్యమైనది మరొకటి లేదని స్పష్టం చేస్తూ… గతేడాది నవంబర్‌లో ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులు ఉండవని తేల్చిచెప్పింది.

వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం… ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలే అమల్లో కొనసాగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల వద్ద సంచరిస్తున్న వీధి కుక్కలను వెంటనే గుర్తించి… వాటిని కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు ఆదేశించింది.
పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై జరుగుతున్న కుక్కల దాడులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నారులపై వీధి కుక్కల దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కొన్ని కుటుంబాలు తమ పిల్లలను బయటకు పంపడానికే భయపడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని కోర్టు ముందు ప్రస్తావించబడింది.
అదేవిధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలు–2023 అమలులో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల జనాభా నియంత్రణ, టీకాల కార్యక్రమాలు, సంరక్షణ కేంద్రాల నిర్వహణ వంటి అంశాల్లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్య మరింత తీవ్రంగా మారిందని పేర్కొంది.

కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై ధిక్కరణ చర్యలు తీసుకునే అవకాశముందని కూడా హెచ్చరించింది. ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేసింది.
అయితే ఈ అంశంపై మరోవైపు జంతు ప్రేమికుల వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కుక్కలను హింసించడం కాదు… నియంత్రిత పద్ధతిలో సంరక్షణ, టీకాలు, జనాభా నియంత్రణ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సాధారణ ప్రజలు మాత్రం ఒకటే చెబుతున్నారు — “మా పిల్లలు, మా కుటుంబాలు భయపడకుండా రోడ్లపై నడిచే పరిస్థితి కావాలి” అని.
ప్రజల భద్రత… జంతు సంరక్షణ… ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా?
అనే ప్రశ్నకు ప్రభుత్వాలు ఎలా సమాధానం చెబుతాయన్నదే ఆసక్తికరంగా మారింది.
