మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా

మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా

  • సర్పంచ్ బానోత్ కొండయ్య

మరిపెడ, ఆంధ్రప్రభ:
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని సర్పంచ్ బానోత్ కొండయ్య అన్నారు.బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నేతావత్, పర్కజాల తండా గ్రామ పంచాయతీలోని నేతావత్ తండా ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ ఏఈ అజయ్ తో కలిసి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొండయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన,డిజిటల్ విద్య, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తమవంతు కృషి చేస్తానని,గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

విద్యార్థుల భద్రత,పాఠశాల అభివృద్ధి, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు.ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయితే పాఠశాలకు రక్షణ కల్పించబడటంతో పాటు విద్యార్థులకు మరింత సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.అనంతరం ఏఈ అజయ్ మాట్లాడుతూ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దలు,తండావాసులు తదితరులు పాల్గొన్నారు.