వాలీబాల్ నెట్ వైరుతో యువకుడి దారుణ హత్య!

వాలీబాల్ నెట్ వైరుతో యువకుడి దారుణ హత్య!

తెనాలి, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా తెనాలి మండలంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర హత్యోదంతం వెలుగుచూసింది. కంచర్లపాలెం గ్రామ శివారులో ఓ యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడిని కోపల్లె కార్తీక్ (18)గా పోలీసులు గుర్తించారు.

ఘటన వివరాలు..

పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం… కంచర్లపాలెం గ్రామ శివారులోని వాలీబాల్ కోర్టు వద్ద కార్తీక్ మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తెనాలి రూరల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
యువకుడి గొంతుకు వాలీబాల్ నెట్ తాడు (వైరు) గట్టిగా బిగించి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే, గుర్తుతెలియని వ్యక్తులు కార్తీక్‌ను వాలీబాల్ కోర్టు వద్దకు రప్పించి, నెట్ వైరుతో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..

సమాచారం అందిన వెంటనే రూరల్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలా? లేక స్నేహితుల మధ్య జరిగిన తక్షణ గొడవలా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుడు కార్తీక్ చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు? రాత్రి సమయంలో అతడిని వాలీబాల్ కోర్టు వద్దకు ఎవరు పిలిచారు? అనే విషయాలను తెలుసుకోవడానికి అతడి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఈ ఘటనతో కంచర్లపాలెం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.