కోయిలకొండ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం
కోయిలకొండ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం
- చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్, క్రైం, ఆంధ్రప్రభ:
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని కోయిలకొండ చౌరస్తాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొత్తగా ఈ ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసినప్పటికీ.. అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికల బోర్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో మహబూబ్‌నగర్ నుండి కోయిలకొండ వెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. గత ఆదివారం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. నవాబుపేట మండలం ఎన్మగండ్ల గ్రామానికి చెందిన కనేమౌని నర్సింలు ఆదివారం తన వ్యక్తిగత పని పూర్తి చేసుకున్నాడు. అనంతరం తన అత్తగారిల్లయిన రుద్రారం (బుద్ధారం) గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి పండుగకు హాజరయ్యేందుకు బైక్‌పై బయలుదేరాడు. కోయిలకొండ చౌరస్తా సమీపంలోకి రాగానే బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయింది. కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డుపై మట్టి దిమ్మెలు అడ్డంగా వేసి ఉండటం, పెద్ద ఎత్తున మట్టి పోసి వదిలేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ ప్రమాదంలో నర్సింలు తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుండి దాదాపు రెండు రోజుల పాటు కోమాలోనే ఉంటూ మృత్యువుతో పోరాడిన నర్సింలు.. చివరకు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచాడు.
కొత్త బైపాస్ చౌరస్తాలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనుల నిర్లక్ష్యం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కోయిలకొండ చౌరస్తా వద్ద తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
