రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు : ఏపిడి విజయలక్ష్మి
లింగంపేట, మే 18, ఆంధ్రప్రభ: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ ఏపీడీ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం లింగంపేట మండల కేంద్రంతో పాటు మేంగారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
తూకం పూర్తైన ధాన్య లోడ్లను లారీల ద్వారా ఎంత మేరకు తరలించారో ఆమె ఆరా తీశారు. నిర్వాహకుల వద్ద ఉన్న రికార్డులు, దస్త్రాలను పరిశీలించారు. రైతుల ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా సమయపాలన పాటించాలని, వెంటనే తూకం వేసి లారీలలో లోడ్ చేసి సంబంధిత రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు.
విధుల నిర్వహణలో ఎలాంటి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వినోద్‌కుమార్, సీసీలు గంగరాజు, వివో కమిటీ సభ్యులు సావిత్రి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
