మర్డర్ కేస్ మిస్టరీ వీడింది.. నిందితుడి అరెస్ట్

మర్డర్ కేస్ మిస్టరీ వీడింది.. నిందితుడి అరెస్ట్

షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ!

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి వద్ద గురువారం జరిగిన ఘోర హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మర్డర్ కేసుకు సంబంధించిన మిస్టరీని పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. మృతుడు గోడిశాల విజయ్ కుమార్ భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. శనివారం నిందితుడైన అక్కినపల్లి అఖిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పులి రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నిందితుడు అక్కినపల్లి అఖిల్ భార్యతో మృతుడు విజయ్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానమే ఈ దారుణానికి కారణమని పోలీసులు తెలిపారు. విజయ్ కుమార్‌ను ఎలాగైనా అంతమొందించాలని కక్ష పెంచుకున్న అఖిల్, పక్కా ప్రణాళికతో ఈ హత్యాకాండకు తెరలేపాడు.

పోలీసుల విచారణలో నిందితుడు అఖిల్ ఒళ్ళు గగుర్పొడిచే నిజాలను అంగీకరించాడు. గురువారం ఉదయమే తన భార్యాపిల్లలను తల్లిదండ్రుల వద్దకు పంపించి వేశాడు. అనంతరం కాశీబుగ్గలో కొబ్బరి బోండాలు నరికే పెద్ద కత్తిని కొనుగోలు చేసి, దాన్ని తన పల్సర్ బైక్ ట్యాంక్ కవర్‌లో దాచాడు. విజయ్ కుమార్ ప్రతిరోజూ ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న కల్లు మండవకు వస్తాడనే విషయ తెలుసుకుని అఖిల్ అక్కడికి చేరుకున్నాడు. విజయ్ కుమార్‌తో కలిసి కల్లు తాగుతూ, ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు నటించి నమ్మకం కలిగించాడు.

విజయ్ కుమార్ ఏమాత్రం ఊహించని తరుణంలో.. అఖిల్ బైక్ ట్యాంక్ కవర్‌లో దాచిన కత్తిని తీసి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. విజయ్ కుమార్ తల, కుడి చేయి, వీపు, ఛాతి భాగాలపై విచక్షణారహితంగా నరికి అక్కడికక్కడే ప్రాణాలు తీశాడు. హత్య అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు.

నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, శనివారం ఎల్కతుర్తిలోని సత్యసాయి గార్డెన్స్ వద్ద అతన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన పల్సర్ బైక్, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితుడికి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు సిఐ పులి రమేష్ తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై నరసింహారావు, ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ సిబ్బందిని సీఐ అభినందించారు.

Leave a Reply