ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ రవి రాథోడ్ గురువారం తొర్రూరు పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, వైద్యులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, వైద్యుల వివరాలు, చికిత్సల ధరల పట్టికలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు.

అలాగే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు లింగ నిర్ధారణ చట్టవిరుద్ధమని హెచ్చరించారు. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఈ తనిఖీల్లో వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.