ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం
ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం
వేసవి సెలవులు, వివాహాల సీజన్, ఆదివారంతో…
అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
తెల్లవారుజాము నుంచే కిక్కిరిసిన దర్శన క్యూ లైన్లు..
సామాన్య భక్తులకు ప్రాధాన్యం..
ప్రత్యేక దర్శనాలపై తాత్కాలిక నియంత్రణ
వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక సౌకర్యాలు..
నీరు, మజ్జిగ, అన్నప్రసాదం పంపిణి..
గందరగోళం గా రూ 500 టికెట్ల జారి..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. వేసవి సెలవులు, వివాహాల సీజన్, సెలవుదినం ఒకేసారి కలిసి రావడంతో దూర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.తెల్లవారుజాము నుంచే అన్ని దర్శన క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నానికి ఆలయ పరిసరాలు పూర్తిగా భక్తజనంతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది.
అంచనాలకు మించి..
దేవస్థానం అధికారుల అంచనాలకు మించి భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఇప్పటికే సుమారు 40 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. క్యూ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు అమలు చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో ఉదయం 10.30 గంటల నుంచే రూ.500 ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాలను నిలిపివేసి, అంతరాలయ దర్శనాలను పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే విఐపీ, ప్రోటోకాల్ దర్శనాలపైనా బ్రేక్ విధించి సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించారు.
వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు..
ప్రధాన ఆలయం వెనుక భాగంలోని టికెట్ స్కానింగ్ పాయింట్ వద్ద చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, వికలాంగులకు టికెట్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక దర్శన లైన్ ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. కొంతమందిని ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యం ద్వారా పైకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా దేవస్థానం ఆధ్వర్యంలో సేవకులు భక్తులకు మంచి నీరు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు విరివిగా పంపిణీ చేశారు. కొండపై, దిగువ ప్రాంతాల్లో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి భక్తులకు ఉపశమనం కల్పించారు. ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ కూడా నిరంతరంగా కొనసాగింది.
మధ్యాహ్నం నుండి పెరిగిన రద్దీ…
మధ్యాహ్నం నైవేద్యం సమయములో దర్శన క్యూ లైన్లు కొంతసేపు నిలిపివేయడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. మరోవైపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో ఘాట్ రోడ్ వైపు సాధారణ వాహనాల రాకపోకలను నియంత్రించి, దేవస్థానం బస్సులు, బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులను కొండపైకి చేర్చే చర్యలు చేపట్టారు. వేసవి వేడి కారణంగా అస్వస్థతకు గురైన కొంతమంది భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో వెంటనే వైద్యసేవలు అందించారు. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
రూ 500 టికెట్లపై గందరగోళం…
భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు రూ 500 అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసి, భక్తులందరికీ అమ్మవారి దర్శనాన్ని బంగారు వాకిలి ద్వారానే కల్పించారు. అయితే అప్పటికే రూ 500 రూపాయలు ఆన్లైన్ ద్వారా తీసుకున్న చాలామంది భక్తులు ఇబ్బంది పడక తప్పలేదు. ఇటీవల ఆన్లైన్ టికెట్ల కోసం భారీ ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో ముందస్తుగా కొంతమంది ఆన్లైన్లో వాట్స్అప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుని ఆలయానికి చేరుకున్న సమయంలో వారికి చుక్క ఎదురయింది. రద్దీకి అనుగుణంగా అధికారులు కూడా క్యూలైన్లను త్వరగా నియంత్రించాలనే ఉద్దేశంతో భక్తులను లాగుతుండటం వివాదాస్పదమైంది. ఈ సందర్భంలో చాలామంది భక్తులు ఆలయ అధికారులు తీరిపై విమర్శలు చేసి ఆందోళన చేశారు. గంటల తరబడి క్యూ లైన్ లో అమ్మవారి దర్శనం కోసం వస్తే మనస్ఫూర్తిగా మనసారా కల్లారా అమ్మవారిని చూడకుండానే లాగేస్తున్నారంటూ కొంతమంది ఉత్తరాంధ్రకు చెందిన భక్తులు ఆంధ్రప్రభ వద్ద ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో పలు ఆలయాలకు ఉన్న కమిటీ సభ్యులు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి ఆదివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతరాలయ దర్శన రద్దు, టిక్కెట్ల కేటాయింపు వంటి గందరగోళ పరిస్థితులు, అధికారుల మధ్య కొరబడిన సమన్వయం భక్తులకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
