ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వ నిర్ణయం స్వాగతార్హం..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రత్యేక కమిటీ నిర్ణయం ఉద్యమకారుల్లో కొత్త ఆశలను నింపిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబరావు పేర్కొన్నారు. 679 జీవో అమలు ద్వారా ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ప్రభుత్వ సంకల్పం స్వాగతించదగ్గదని అన్నారు.
నల్లబెల్లిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు జీవితం గడిపిన వారు, వికలాంగులైన వారు, క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వారు, బైండోవర్ కేసులతో ఇబ్బందులు పడిన వారు,విద్యార్థి నాయకులు, మహిళా ఉద్యమకారులు, మీడియా ప్రతినిధులు సహా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక కమిటీ పూర్తిస్థాయి పారదర్శకతతో పనిచేసి, పేపర్ కటింగ్స్, కేసుల వివరాలు,ఉద్యమ ఆధారాలను పరిగణలోకి తీసుకుని అసలైన ఉద్యమకారులను గుర్తించాలని కోరారు.జార్ఖండ్ రాష్ట్రం తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు కూడా గౌరవప్రదమైన ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక కమిటీ చైర్మన్ కేశవరావును విజ్ఞప్తి చేశారు.గత తొమ్మిది సంవత్సరాలుగా చీమ శ్రీనివాసరావు నాయకత్వంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఉద్యమకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం వల్లే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి,అర్హుల జాబితాను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఉద్యమకారుల ఆశలు నెరవేరనున్నాయని ఆకుల సాంబరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు తంగేళ్ల భాస్కర్, ఉపాధ్యక్షులు కొత్తగట్టు ప్రభాకర్, కోశాధికారి ఓదెల రవి, జేఏసీ మండల చైర్మన్ వేముల రాజు, మండల ఉపాధ్యక్షులు ఎన్నమల్ల నరసయ్య, అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పరికి కోర్నేల్ తదితరులు పాల్గొన్నారు.
