ప్రతిభకు పట్టాభిషేకం..

ప్రతిభకు పట్టాభిషేకం..

  • ఆదిత్యకు సీఎం చేతుల మీదుగా లక్ష రూపాయల పురస్కారం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఆదిత్య ముఖ్యమంత్రి చేతుల మీదుగా లక్ష రూపాయల పురస్కారాన్ని స్వీకరించారు.ఇంటర్ విద్యాశాఖ చరిత్రలో హసన్‌పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీ ఇంగ్లీష్ మీడియం విభాగంలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి,రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించిన ఆదిత్య.. తన ప్రతిభకు అత్యున్నత గుర్తింపును అందుకున్నాడు.

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిత్య అద్భుత ప్రతిభను కొనియాడుతూ, ప్రభుత్వం తరపున లక్ష రూపాయల నగదు బహుమతిని చెక్కు రూపంలో అందజేశారు. ఈ అద్భుత విజయంపై హనుమకొండ జిల్లా ఆర్.జె.డి ఎ గోపాల్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పడానికి… ఆదిత్య సాధించిన ఫలితమే నిదర్శని అన్నారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక ప్రభుత్వ కళాశాల విద్యార్థి పురస్కారం అందుకోవడం జిల్లాకే గర్వకారణమని, హసన్‌పర్తి కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందాన్ని అభినందించారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక్కడుగా నిలిచి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆదిత్య పురస్కారం అందుకోవడం పట్ల ప్రిన్సిపాల్ బి. సునీత ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విజయం కేవలం ఆ విద్యార్థిది మాత్రమే కాదని, హసన్‌పర్తి కళాశాల అధ్యాపక బృందం కఠోర శ్రమకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పురస్కారం అందుకుని తిరిగొచ్చిన ఆదిత్యకు కళాశాల అభివృద్ధి కమిటీ బాధ్యులు చకిలం రాజేశ్వర్ రావు, అధ్యాపక బృందం ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హరి ప్రసాద్, సరిత, శ్రీనివాస్, సుమలత,పద్మారాణి, సాయి ప్రసాద్, సైదులా సాహెబ్, డి. వెంకట కృష్ణ, ఎస్. శివ శంకర్, ఆర్. విజయ్ కుమార్, ఏ. సత్యనారాయణ మూర్తి, రవి ప్రకాష్ తదితరులు పాల్గొని ఆదిత్యను అభినందించారు.

Leave a Reply