అగ్నిప్రమాద బాధిత రైతుకు పరామర్శ…
మోపిదేవి, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని బొబ్బర్లంక గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోనేరు శివ లీల ప్రసాద్‌కు చెందిన గడ్డివామును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటనతో సుమారు వేల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆదివారం బొబ్బర్లంక గ్రామంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దగ్ధమైన గడ్డివామును చూసి, జరిగిన తీరును బాధితుడు శివ లీల ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం వెనుక ఉన్న కారణాలు, ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నాయా అనే విషయాలపై స్థానిక పార్టీ నాయకులతో చర్చించారు.ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ… పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అర్ధరాత్రి వేళ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దుర్మార్గమని, దీనిపై స్థానిక పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి,మోపిదేవి మండల కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు,కొక్కిలిగడ్డ పీఏసీఎస్ అధ్యక్షులు కోనేరు నాగేశ్వరరావు,పార్టీ నాయకులు బాల జగన్నాథ నాగేశ్వరరావు,దొప్పలపూడి జగదీష్,బాల తేజ,ముమ్మనేని బాబూరావు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
