కృష్ణా తరంగాలపై బౌద్ధ విజ్ఞాన దీపిక..
కృష్ణా తరంగాలపై బౌద్ధ విజ్ఞాన దీపిక..
- విశ్వవిఖ్యాత ‘నాగార్జునకొండ’ ద్వీప మ్యూజియం..
- రేపు అంతర్జాతీయ మ్యూజియం డే…
గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రాచీన చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా, భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బౌద్ధ కేంద్రంగా నాగార్జునకొండ విరాజిల్లుతోంది. ఒకప్పుడు కృష్ణా నది ఒడ్డున గొప్ప బౌద్ధ విద్యాకేంద్రంగా, సాంస్కృతిక రాజధానిగా వెలిగిన ఈ ప్రాంతం, రేపు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలుస్తోంది. ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో, కృష్ణా నది జలాల మధ్య ఒక అద్భుత ద్వీపంపై కొలువై ఉన్న ఇక్కడి మ్యూజియం అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాలగర్భంలో కలిసిపోవాల్సిన అద్భుత ప్రాచీన సంపదను కాపాడుకున్న తీరు, ప్రపంచ పురావస్తు చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు ఈ ప్రాంతానికి ఎంతో ప్రాచీనమైన, వైభవవంతమైన చరిత్ర ఉంది. క్రీస్తు శకం రెండు నుండి నాలుగు శతాబ్దాల మధ్య కాలంలో ఇక్కడ ఇక్ష్వాకు వంశపు రాజుల పరిపాలన సాగింది. వారు ‘విజయపురి’ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించినట్లు పురాతన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. శూన్యవాద ప్రతిపాదకుడు, జగత్ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడే నివసించడం వల్ల, ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి ‘నాగార్జునకొండ’ అనే పేరు వచ్చింది. ఆ కాలంలో ఇది ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ విశ్వవిద్యాలయంగా, విహారాలు, ప్రార్థన మందిరాలు, మహాస్తూపాలతో విజ్ఞాన శీర్షంగా విరాజిల్లింది. భారత దేశ నలుమూలల నుంచే కాకుండా చైనా, శ్రీలంక, బర్మా, టిబెట్ వంటి సుదూర దేశాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించారనడానికి బలమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో పురావస్తు వైభవం వెలికితీయడం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. 1926లో స్థానిక ఉపాధ్యాయుడు సూరపరాజు వెంకటరామయ్య ఇక్కడి అవశేషాలను మొదటిసారి గుర్తించగా, ఆ తర్వాత బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో విస్తృత తవ్వకాలు జరిగాయి. ఆ సమయంలో బౌద్ధ స్తూపాలు, బ్రాహ్మీ శాసనాలు, విగ్రహాలు, రోమన్ నాణేలు బయటపడటంతో నాగార్జునకొండ ఒక గొప్ప నాగరికత కేంద్రంగా ప్రపంచానికి తెలిసింది.
అయితే, 1950వ దశకంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ నిర్ణయంతో ఈ చారిత్రక సంపద మొత్తం నీట మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిని రక్షించేందుకు అప్పటి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలోనే అతిపెద్ద పురావస్తు సంరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక భారీ డ్యామ్ వల్ల మునిగిపోతున్న చారిత్రక ప్రదేశం నుండి పురాతన కట్టడాలను, శిల్పాలను పూర్తిగా వేరే చోటికి, అంటే ఒక ఎత్తైన కొండపైకి సురక్షితంగా తరలించి, దానిని ఒక ద్వీపంగా మార్చి మ్యూజియం ఏర్పాటు చేయడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.

దాదాపు 3500 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణా నది మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ ద్వీపంలో 1955లో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడి గ్యాలరీలలో ఆచార్య నాగార్జునుడి కాలం నాటి బౌద్ధ విగ్రహాలు, బుద్ధుడి పవిత్ర అస్థి అవశేషాలు (ధాతువులు), రాతి శిల్పాలు భద్రంగా ఉన్నాయి. ఇక్కడి శిల్పకళ అంతా ప్రపంచ ప్రసిద్ధ ‘అమరావతి బౌద్ధ శిల్పకళా శైలి’ని పోలి ఉంటుంది. లేత పచ్చటి సున్నపురాతిపై బుద్ధుడి జీవిత ఘట్టాలను, జాతక కథలను అత్యంత జీవకళతో నాడు మలిచారు.
ద్వీపం వెలుపల నాటి రోమన్ శైలి అంఫిథియేటర్ (నాట్యశాల), స్నానఘట్టాలు, మహాస్తూప నమూనాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ అంతర్జాతీయ మ్యూజియం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజధానులకు దాదాపు సమాన దూరంలో ఉండటం మరో విశేషం. హైదరాబాద్ నుండి, అటు అమరావతి (విజయవాడ) నుండి నాగార్జునసాగర్ దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

సాగర్ చేరుకున్నాక, అక్కడ విజయపురి సౌత్ లేదా నార్త్ లాంచీ స్టేషన్ నుండి కృష్ణా నది జలాలపై దాదాపు 45 నిమిషాల పాటు సాగే బోట్ ప్రయాణం ద్వారా మాత్రమే ఈ మ్యూజియానికి చేరుకోగలం. ఈ ద్వీపానికి వెళ్లడానికి లాంచీ ప్రయాణం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయ మార్గమూ లేదు. ఈ ప్రయాణం పర్యాటకులకు సాహసంతో కూడిన ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది. ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతానికి, ప్రాచీన భారతీయ సంస్కృతికి వారధిగా నిలిచిన నాగార్జునకొండను ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం వేళ సందర్శించడం ప్రతి ఒక్కరికీ చరిత్రపై గౌరవాన్ని పెంపొందిస్తుంది.
