పెట్రోలు డీజిల్ ధరల పెంపును ఉపసంహరించాలి
దమ్మపేట, ఆంధ్రప్రభ ; పెట్రోల్ , డీజిల్ పై పెంచిన ధరలను ఉపసంహరించాలని సీఐటీయూ మండల కమిటీ ఆద్వర్యంలో శనివారం దమ్మపేటలో ధర్నా నిర్వహించారు . ఈ సందర్బంగా సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు మాట్లాడుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో సరిపడా చమురు నిల్వలున్నాయని ఇప్పటిదాకా నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను మరోసారి వంచించిందన్నారు.
మోదీ పొదుపు చర్యలు ప్రకటించడానికి అసలు కారణం ధరల పెంపుదల కోసమేనని అన్నారు. ఇప్పటికే వంట గ్యాస్ రూ.50లు, కమర్షియల్ గ్యాస్ దాదాపు రూ.1000లు పెంచడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతపడి ఉపాధిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు చమురు ధరలు పెంచడం వలన రవాణా రంగంపై పెనుభారం పడనుందని అన్నారు.
ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అంతిమంగా పేద ప్రజలు ధరలు భారం మోయవలసి వస్తుందని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమం లో సీఐటీయూ నాయుకులు విజయలక్ష్మి, కోటేశ్వరరావు, యశోద, యుగంధర్ , ధర్మ తదితరులు పాల్గొన్నారు.
