విద్యా వారోత్సవాల్లో ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

కుంటాల, ఆంధ్రప్రభ : విద్యా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని కుంటాల గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే పలు విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి విరాళంగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది.

ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వట్టోలి ముత్యం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ఉపయోగపడే రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, తెలంగాణ చరిత్ర, భారత చరిత్రతో పాటు జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను గ్రంథాలయ నిర్వహణ అధికారికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు.

పుస్తకాల విరాళం అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పుస్తక పఠనం విద్యార్థులు, యువతలో విజ్ఞానంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ అధికారి రాజు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply