ఏడాది కిందటే వివాహం.. అంతలోనే విషాదం..
ఏడాది కిందటే వివాహం.. అంతలోనే విషాదం..
జన్నారం ఆంధ్రప్రభ:
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గజ్జల భూపతి (31) ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
భూపతికి అదే గ్రామానికి చెందిన శ్వేతతో ఏడాది క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. ఈ నెల 10వ తేదీన ప్రసవానికి వైద్యులు తేదీ నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి తండ్రి మల్లేష్, తల్లి సత్యవ్వ, భార్య శ్వేత, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మృతుడి తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.
