హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ:

ఉరవకొండ మండలం పరిధిలోని కౌకుంట్ల, వై. రాంపురం గ్రామాల వద్ద జరుగుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ప్రధాన కాలువ లైనింగ్ పనులను జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాలువ వెడల్పు పనులు గత సంవత్సరం ప్రారంభించబడినట్లు తెలిపారు. ప్యాకేజ్ 88 నుండి 216.3 కిలోమీటర్ల వరకు కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా హంద్రీనీవా జలాలు ప్రవహిస్తాయని ఆయన వివరించారు. ఇందులో అనంతపురం జిల్లాలో 144 కి.మీ నుండి 216.3 కి.మీ వరకు విస్తరించి ఉన్న కాలువ భాగం ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.

కాలువలో గండ్లు పడకుండా, సీపేజీ మరియు లీకేజీ సమస్యలు లేకుండా ఉండేందుకు లైనింగ్ పనులు అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 82 కిలోమీటర్ల పరిధిలో 6.50 కిలోమీటర్ల కాలువ లైనింగ్ పనులు గుర్తించి ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని సమాచారం.

కౌకుంట్ల, వై. రామాపురం ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్, రైతులకు సాగునీరు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనులను త్వరగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జలవనరుల శాఖ గుంతకల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ నాయక్, కాంట్రాక్టర్ ప్రతినిధి రామకృష్ణ యాదవ్, డిఈఈ రమణ, ఏఈలు సుదర్శన్ మూర్తి, తహసిల్దార్ భోగన్న గౌడ్, వీఆర్వో వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply