ఇంధన ధరల షాక్..!
ఇంధన ధరల షాక్..!
- పెట్రోల్, డీజిల్పై భారీ పెంపు…
- పెట్రోల్ రూ 5 డీజిల్ పై 3 రూపాయలు..
- దేశ వ్యాప్తంగా నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి…
- నాలుగేళ్ల తర్వాత ధరల సవరణ..
- సామాన్యుడిపై తప్పని అదనపు భారం..
- అంతర్జాతీయ ముడిచమురు ప్రభావం..
- నష్టాల నుంచి బయటపడే ప్రయత్నంలో ఆయిల్ కంపెనీలు..
- రవాణా నుంచి నిత్యావసరాల దాకా ధరల మంటలు తప్పవా..?
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఇంధన వినియోగదారులకు శుక్రవారం ఉదయం పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ , భారత్ పెట్రోలేం , హిందూస్తాన్ పెట్రోలేం పెట్రోల్ రూ 3.30, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.3.14 పైసలు మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఈ ధరల సవరణ సామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది.
ప్రస్తుత ధరలు ఇలా…
దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో పెట్రోల్ ధర రూ.94.77 నుంచి రూ.97.77కి, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.90.67కు చేరింది. రాష్ట్ర పన్నులు, స్థానిక వ్యత్యాసాల కారణంగా ప్రాంతాలవారీగా ధరల్లో తేడాలు కనిపించనున్నాయి.
విజయవాడలో
విజయవాడ లో పెట్రోల్ పాత ధర 110.23 పైసలు..పెరిగిన తరువాత 113.53 పైసలు ఉండగా డీజిల్ పాత ధర 98.03 పైసలు పెరిగిన తరువాత 101.17 పైసలుగా ఉన్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తత నడుమ…
ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు దీర్ఘకాలంగా ధరలు పెంచకుండా నష్టాలను భరిస్తూ వచ్చాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరిగిన పెంపు కూడా వాస్తవంగా అవసరమైన పెంపులో ఒక భాగమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్ని వర్గాల పైన ప్రభావం…
ఈ ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా రవాణా, సరకు రవాణా, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా కనిపించే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సరకు రవాణా వ్యయం పెరగడం వల్ల వినియోగదారుల జేబుపై మరింత భారం పడే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ రంగం ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే ఇంకోసారి ధరల సవరణ జరిగే అవకాశాన్ని కూడా పరిశ్రమ వర్గాలు కొట్టిపారేయడం లేదు. జిల్లా స్థాయిలో చూస్తే, ఈ పెంపు ప్రభావం వ్యవసాయ రవాణా నుంచి నగర జీవన వ్యయాల వరకు విస్తరించే అవకాశముండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
