117 seats | సీఎం పీఠంపై సినీహీరో

117 seats | సీఎం పీఠంపై సినీహీరో

ముఖ్య‌మంత్రిగా విజ‌య్
టీవీకేకు మెజార్టీ స్థానాలు
కాంగ్రెస్, పీఎంకే మ‌ద్ద‌తు కోసం విజ‌య్ ప్ర‌య‌త్నాలు
అభిమాన సంఘాల బ‌లంతో ఘ‌న విజ‌యం
సీనీ న‌టుల‌కు ప‌ట్టం క‌ట్ట‌డం తంబీలే టాప్

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఒక‌ప్ప‌డు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో నెల‌కొన్న రాజ‌కీయ శూన్య‌త‌ను దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు త‌న సినీగ్లామ‌ర్‌తో రూపుమాపేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేదోడికి కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న‌ కేవ‌లం తొమ్మిది నెల‌ల కాలంలోనే ప్ర‌జాద‌ర‌ణ పొంది టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి ప్ర‌భంజ‌నం సృష్టించారు. అదే త‌ర‌హాలో త‌మిళ సినీ హీరో విజ‌య్ కూడా రాష్ట్రంలోని రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న‌ను తొల‌గించేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. రెండేళ్ల క్రిత‌మే టీవీకే పార్టీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ 2025వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ మాసం నుంచి క్రియాశీల రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈయ‌న కూడా దివంగ‌త నేత ఎన్‌టీఆర్ త‌ర‌హాలోనే త‌న చ‌రిష్మాతో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రై ఎన్నిక‌ల్లో టీవీకేను విజ‌య‌తీరాల‌కు చేర్చి త‌మిళ‌నాట మ‌రో చరిత్ర సృష్టించారు.

117 seats | చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : త‌మిళ‌నాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీతో ప్రభంజనం సృష్టించారు. అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా, అధికార డీఎంకె గట్టి ఎదురుదెబ్బ తింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో అటు రాజకీయంగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేకెత్తించింది. వెండితెరపై తనదైన ముద్ర వేసిన ‘దళపతి’ విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా ‘సూపర్‌హిట్’ సాధించారు.

2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, తొలి ట్రెండ్‌లు రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలలో ఉత్సాహాన్ని పెంచాయి. విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (టీవీకే), 100 కు పైగా స్థానాల్లో నిర్ణయాత్మక ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. అత్యంత ఆసక్తికరమైన పోటీ చెన్నైలోని పెరంబూర్ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతోంది. ఇక్కడ విజయ్ స్వయంగా పోటీ చేస్తున్నారు. విజయ్, డీఎంకే పవర్ ఫుల్ నాయకుడు ఆర్.డి. శేఖర్‌తో ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటున్నారు. తొలి ట్రెండ్‌లు విజయ్ తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఇక్కడ విజయ్ టాప్ లీడ్‌లో దూసుకుపోతున్నారు.

ఇక సీఎం పీఠం దక్కించుకునేందుకు 117 సీట్లు అవ‌స‌రం కాగా, టీవికె పార్టీ మేజార్టీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచింది.. దీంతో ఇత‌ర పార్టీల‌తో క‌ల‌సి ప్ర‌భుత్వ ఏర్పాటున‌కు విజ‌య్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. ముఖ్యంగా త‌మిళ‌నాడులోని కాంగ్రెస్, పీఎంకకే పార్టీల‌తో ఇప్ప‌టికే సంప్ర‌దింపులు ప్రారంభిచారు..

117 seats | విజ‌య్ రాజ‌కీ ప్ర‌స్థానం..

త‌మిళ హీరో జోస‌ఫ్ విజయ్ తన రాజకీయ ప్రవేశానికి చాలా కాలం క్రితమే సన్నాహాలు మొదలుపెట్టారు. 2024 ఫిబ్రవరిలో, విజయ్ తన పార్టీ పేరును టీవీకే అని అధికారికంగా ప్రకటించారు. అయితే, తాను 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోనని, తన లక్ష్యం కేవలం 2026 అసెంబ్లీ ఎన్నికలేనని ఆయన స్పష్టం చేశారు. తన చివరి చిత్రం “జన నాయగన్” తర్వాత నటనకు స్వస్తి చెప్పి, ఇకపై పూర్తిస్థాయిలో ప్రజలకు సేవ చేస్తానని తేల్చి చెప్పారు. విజయ్ చివరి చిత్రం “జన నాయగన్” విడుదల కూడా వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డుతో సమస్యలు, ఆన్‌లైన్ లీక్‌లను ఎదుర్కొన్న ఈ చిత్రం, ఇప్పుడు 2026 మే 8న థియేటర్లలోకి రానుంది.

117 seats | విజయ్ మక్కల్ ఇయక్కం ..

విజయ్ బలం ఆయన అభిమాన గణం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ . ‘దళపతి’ విజయ్ తన అభిమాన సంఘాలను ఒకచోట చేర్చి ఏర్పాటు చేసిన సామాజిక సేవా సంస్థ/సంఘం. ఇది క్రమంగా ఒక శక్తివంతమైన రాజకీయ సంస్థగా ఎదిగింది. డిసెంబర్ 2023లో తమిళనాడు వరద బాధితులకు ఆయన అందించిన మద్దతు, ‘ప్రజానాయకుడు’గా ఆయన ప్రతిష్టను సుస్థిరం చేసింది. అక్టోబర్ 2024లో విల్లుపురంలో జరిగిన ఆయన మొదటి ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం, రాష్ట్రంలోని సంప్రదాయ పార్టీలకు ఆయన బలాన్ని తెలియజేసింది. తన ర్యాలీలలో విజయ్ ‘ద్రావిడ నమూనా’పైనా, బంధుప్రీతిపైనా నేరుగా విమర్శలు చేశారు.

117 seats | సవాళ్లతో నిండిన ప్రయాణం..

విజయ్ రాజకీయ జీవితం వివాదాలు, సవాళ్లు లేకుండా సాగలేదు. 2025 సెప్టెంబర్‌లో కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో, ఆయన ఇరకాటంలో పడ్డారు. ఈ కేసు విషయమై సీబీఐ విజయ్‌ని ప్రశ్నించింది. అంతేకాకుండా, రాజకీయ సిద్ధాంతం విషయంలో విజయ్‌కు తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో ఉన్న వివాదం కోర్టు వరకు వెళ్లింది.

117 seats | సినీ ప్ర‌ముఖుల‌కు ప‌ట్టం..

ఎంజీఆర్ అయినా, జయలలిత అయినా, సినిమా, రాజకీయాల కలయికను తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. 51 ఏళ్ల విజయ్‌కు ఉన్న రూ.648.9 కోట్ల సంపద, ఆయనకున్న భారీ అభిమానగణం దళపతి విజయ్‌ని బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. విజయ్‌కు కలిసొచ్చిన యూత్‌, దళిత్‌ ఓటు బ్యాంకు.. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన ఫలితాల దిశగా టీవీకే దూసుకెళ్తోంది. దీంతో విజయ్‌ నివాసం దగ్గర అధికారులు భద్రత పెంచారు.. చెన్నైలోని విజయ్‌ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.. విజయ్‌ ఇంటి దగ్గర బాణ‌సంచా పేల్చి అభిమానుల సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

CLICK HERE TO TEAD MORE : 105 seats | దళపతి విజయ్ ప్రస్థానం ఇదే..

CLICK HERE TO TEAD MORE :