Telangana warehouse crisis | ముక్కిపోతున్న బియ్యం.. దుర్గంధంగా మారిన గోదాములు

Telangana warehouse crisis | ముక్కిపోతున్న బియ్యం.. దుర్గంధంగా మారిన గోదాములు
Telangana warehouse crisis | గోదాముల కొరతతో మక్క రైతుల అవస్థలు
సిద్దిపేటలో బియ్యానికి లక్కపురుగుల ముప్పు
నిల్వ సమస్యతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
Telangana warehouse crisis | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో / సంగారెడ్డి, సిద్దిపేట, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గోదాముల సమస్య తీవ్రంగా మారింది. గతేడాది చేసిన నిల్వలు ఇప్పటికీ తరగకపోవడంతో ఈ ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల నిల్వకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనివల్ల కొనుగోళ్లలో జాప్యం ఏర్పడి రైతుల పాలిట సమస్యగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా మక్క సాగు జరిగింది. రైతుల నుంచి సేకరించిన మక్కలు ఎక్కడ నిల్వ చేయాలనేది సమస్యగా మారింది. ప్రస్తుతం ఉన్న గోదాములన్నీ బియ్యం నిల్వలతో నిండిపోయాయి. ప్రభుత్వం సన్నబియ్యాన్ని పీడీఎస్ సెంటర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో గోదాముల్లో ఉన్న దొడ్డు బియ్యం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాటిని బయటకు తీసే అవకాశం కనిపించడం లేదు.
మళ్లీ ఖరీఫ్‌కు సంబంధించిన బియ్యం కూడా సిద్ధమైపోతున్నాయి. వాటిని ఎక్కడ ఉంచాలన్నదే సమస్య. మార్కెట్లో ఉన్న గోదాముల్లో రైతుల పేర్లతో వ్యాపారులు తమ నిల్వలను పెట్టుకున్నారు. సివిల్ సప్లయి గోదాములతో పాటు సెంట్రల్ వేర్‌హౌస్ గోదాములు కూడా వివిధ రకాల ఉత్పత్తులతో నిండిపోయాయి. మక్కలను ఎక్కడ నిల్వచేయాలనేది సమస్యగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ గోదాములు ఉన్నప్పటికీ వాటిని సివిల్ సప్లయి అధికారులు తీసుకొని ఉత్పత్తులు నిల్వ చేశారు. ప్రధానంగా బియ్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బియ్యాన్ని ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. మిగిలిన గోదాములు కూడా బియ్యానికే సరిపోతుండటంతో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన గోదాములను ప్రైవేట్ వ్యాపారులు తీసేసుకున్నారు. దీంతో మక్కలు నిల్వ చేసేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు సతమతమవుతున్నారు.
మక్కల కొనుగోళ్లు జరగాలంటే ప్రస్తుతం గోదాముల సమస్య పరిష్కారం కావాల్సిందే. అధికార యంత్రాంగానికి ముందుచూపు లేకపోవడంతో మక్క రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు రైతులు పండించిన మక్కల్లో 30 శాతం కొనుగోళ్లు కాకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. యాసంగిలో పూర్తిస్థాయిలో మక్కలు కొనుగోలు చేస్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏనుమాముల మార్కెట్‌తో పాటు జనగామ, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, కేసముద్రం, వర్ధన్నపేట, చిట్యాల, ములుగు, ఏటూరునాగారం, తొర్రూర్ మార్కెట్లతో పాటు దాదాపు అన్ని మండల కేంద్రాల్లో మార్కెట్‌కు సంబంధించిన కవర్ షెడ్లు ఉన్నాయి. చుట్టూ ప్రహరీ లేకపోయినా, పైన రేకుల షెడ్లు, కింద ఎత్తుగా ప్లాట్‌ఫాం ఉండటంతో ఆ కవర్ షెడ్లలో మక్కలను కొద్దిరోజుల పాటు నిల్వ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.
ఇప్పటికే గోదాముల కోసం మార్క్‌ఫెడ్ అధికారులు మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో చూసినప్పటికీ, మార్కెట్లలో ఉన్న కవర్ షెడ్లను వినియోగించుకుని రైతుల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముక్కిపోతున్న బియ్యం
గత ఏడాది సేకరించిన దొడ్డు బియ్యం ఇంకా గోదాముల్లో నిల్వ ఉంది. గోదాంలో నిల్వ ఉన్న బియ్యం కూడా ముక్కిపోయి దుర్వాసన వస్తోంది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న గోదాంలలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో ముక్కిపోతున్నాయి. సంచుల్లో ఉన్న బియ్యాన్ని కాస్త రాశులుగా కింద పోసి పెట్టడంతో దుమ్ము, ధూళితో పాటు చెత్తాచెదారం నిండుకొని ముక్కిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లోనే ముక్కిపోతున్నట్టు తెలిసింది.
సంబంధిత అధికారులను వివరణ కోరగా ఇప్పటికే దొడ్డు బియ్యాన్ని వేలం వేశామని తెలిపారు. కానీ వారు బియ్యాన్ని తరలించకపోవడంతో కింద పోయాల్సి వచ్చిందని చెప్పారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ప్రభుత్వ గిడ్డంగిలో దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దొడ్డు బియ్యం సంచులు దెబ్బతింటున్నాయి. లక్క పురుగులు బియ్యానికి పడుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తేనే గాని తరలించలేమని స్థానిక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న దొడ్డు బియ్యం పాడవుతోంది. మరోవైపు మార్కెట్లో వెల్లువెత్తుతున్న ధాన్యాన్ని నిల్వ చేయడానికి అవసరమైన సంఖ్యలో గోదాములు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
