Telangana solar projects | తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ఊపు
Telangana solar projects | తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ఊపు
Telangana solar projects | 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రభుత్వ ఆమోదం
2030 నాటికి 20 వేల మెగావాట్ల లక్ష్యం
9 జిల్లాల్లో సబ్‌స్టేషన్ స్థాయిలో సోలార్ ప్లాంట్లు
గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక మైలురాయి
Telangana solar projects | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విస్తరణకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో తెలంగాణ సబ్‌స్టేషన్ లెవల్ సోలరైజేషన్ పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ గురువారం జీవో ఎంఎస్ నెం.11ను విడుదల చేసింది.
ఈ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్లను మొత్తం 19 మెగావాట్ల సామర్థ్యంతో 18 భూస్థాపిత సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సుమారు రూ.66.50 కోట్ల అంచనా వ్యయం అవుతోందని ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2025లో భాగంగా 2030 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల సమీపంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్ట్ అమలులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కాజర్ల గ్రామంలో 4 ఎకరాల ప్రభుత్వ భూమిని సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం టీజీఎన్పీడీసీఎల్‌కు ప్రభుత్వం కేటాయించింది. మొత్తం ప్రాజెక్ట్ కోసం 73.25 ఎకరాల భూమి వినియోగంలోకి రానుంది.
ప్రాజెక్ట్‌లో భాగంగా టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 8 మెగావాట్లు, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 11 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎంపిక చేసిన సబ్‌స్టేషన్ల వద్ద ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.
నోడల్ ఏజెన్సీగా రెడ్కో..
ఈ ప్రాజెక్ట్ అమలుకు తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది. ఈపీసీ కాంట్రాక్టర్ల ఎంపికను పోటీ టెండర్ల ద్వారా చేపట్టనున్నారు. సబ్‌స్టేషన్ స్థాయిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం తగ్గడంతో పాటు, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభించనుంది. భవిష్యత్తులో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సబ్‌స్టేషన్ల వద్ద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. విద్యుత్ రంగంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు మైలురాయిగా నిలవనుంది.
