సాంకేతిక సృజ‌న‌కు కేరాఫ్‌.. ప్రాజెక్ట్ ఎక్స్‌పో..

సాంకేతిక సృజ‌న‌కు కేరాఫ్‌.. ప్రాజెక్ట్ ఎక్స్‌పో..

విద్యార్థుల‌ను అభినందించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థుల సృజనాత్మక, సాంకేతిక నైపుణ్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రాజెక్ట్ ఎక్స్‌పో ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీస్ తదితర ఆధునిక సాంకేతిక రంగాలకు సంబంధించిన పలు వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.

విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రదర్శనలో స్మార్ట్ హోమ్ సిస్టమ్స్, ఆటోమేటిక్ కంట్రోల్ మోడల్స్, వ్యవసాయానికి ఉపయోగపడే సాంకేతిక పరికరాలు, రోబోటిక్ మోడల్స్ వంటి అనేక ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ… విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. ప్రతి ప్రాజెక్ట్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని, వారి ప్రతిభ, పరిశోధనా దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను అభినందించారు. యువత సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ, ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

కళాశాల చైర్మన్ బి.ఎస్.అప్పారావు, సెక్రటరీ బి.శ్రీకృష్ణ అధ్యాపకులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా. కె. చైతన్య మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ ఎక్స్‌పో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను పరిచయం చేసే వేదికగా నిలిచిందని అన్నారు.