అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

  • ఏండ్రియల్ గ్రామ సర్పంచ్ ని ప్రశంసించిన
  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామ శివారులో రైతు బొక్క హన్మాండ్లు మూడున్నర ఎకరాలలో సాగు చేస్తున్న అయిల్ ఫామ్ తోటను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. తోటలో మొక్కల పెరుగుదల, నిర్వహణ విధానాలు, సాగు పద్ధతులను పరిశీలించిన కలెక్టర్ పంట అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతు బొక్క హన్మాండ్లు మాట్లాడుతూ… 2022 సంవత్సరంలో మూడున్నర ఎకరాలలో అయిల్ ఫామ్ పంటను ప్రారంభించినట్లు తెలిపారు.

మూడున్నర ఎకరాలలో అయిల్ ఫామ్‌తో పాటు,అంతర్ పంటలుగా కూరగాయలు, సోయా, ఆకుకూరలు, పండ్ల తోటలను సాగు చేస్తూ ఏడాదికి సుమారు రూ.1.20 లక్షల ఆదాయం పొందుతున్నట్లు తెలిపారు.అయిల్ ఫామ్ సాగుకు ఉద్యానవన శాఖ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా ఎకరానికి రూ.4,200 చొప్పున సబ్సిడీ అందించడంతో పాటు డ్రిప్ పరికరాలు కూడా మంజూరు చేసినట్లు రైతు వివరించారు.ప్రభుత్వ సహకారంతో సాగు ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అయిల్ ఫామ్ పంట ధర టన్నుకు సుమారు రూ.23,000 ఉండగా, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని రైతు ఆనందం వ్యక్తం చేశారు.

దీర్ఘకాలికంగా లాభదాయకమైన పంటగా అయిల్ ఫామ్ రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతోందన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు, అంతర్ పంటల సాగు ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాంకేతిక సలహాలను వినియోగించుకొని మరిన్ని రైతులు అయిల్ ఫామ్ సాగుపై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తాగునీటిపై ప్రత్యేక దృష్టి సాధించాలని, గ్రామ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పడమటి కౌసల్య నిర్మించుకుంటున్న ఇంటి పనులను సందర్శించి నిర్మాణ పూరోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ప్లాస్టిక్ సేకరణ నూతన విధానంపై జిల్లా కలెక్టర్ సర్పంచ్ నర్సింలు ను ప్రశంసించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వినూన్నత కార్యక్రమాన్ని, ప్లాస్టిక్ సేకరించి వారికి టిఫిన్ బాక్సులు అందించే విధానం ప్రజల్లో మంచి స్పందన తెచ్చిపెడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, జిహెచ్ఎస్ ఓ జ్యోతి, సిపిఓ, డిఎల్పిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో, మిషన్ భగీరథ, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.