కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో……

రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి హరిక్రిష్ణ బుధవారం రేగొండ మండలంలో ఆకస్మికంగా పర్యటించి వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రూపిరెడ్డిపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, రేగొండ గ్రామంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అక్కడి నిర్వహణపై ఆర్డీవో ఆరా తీశారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలకు పలు కీలక సూచనలు చేశారు.

ధాన్యం బస్తాలు (బారుదాను ) సకాలంలో అందుబాటులో ఉంచాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే సేకరించాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తక్షణమే రవాణా చేయాలని ఆదేశించారు.రవాణా కాంట్రాక్టర్ తగిన సంఖ్యలో వాహనాలు సిద్ధంగా ఉంచి ఎటువంటి అంతరాయం లేకుండా రవాణా నిర్వహించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో రేగొండ మండల డిప్యూటీ తహశీల్దార్ ఎండి.అబ్దుల్ రజాక్, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.