ఎగుమతుల తగ్గుదలతో మార్కెట్ సంక్షోభం

ఎగుమతుల తగ్గుదలతో మార్కెట్ సంక్షోభం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మామిడి రైతుల పరిస్థితి ఈ ఏడాది రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడి తగ్గి కుదేలైన రైతులకు, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు నిలిచిపోవడం కోలుకోలేని దెబ్బ తీసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో మామిడి డిమాండ్ గణనీయంగా పడిపోయింది. దీంతో రైతులు తమ పంటను దేశీయ మార్కెట్లలోనే అతి తక్కువ ధరకు అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికా, కెనడా తదితర దేశాలకు వేల టన్నుల మామిడి ఎగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో (ఇరాన్, ఇజ్రాయెల్) నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా రవాణా వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
విమాన ఛార్జీలు పెరగడం, సముద్ర మార్గాల్లో ఆటంకాలు కలగడంతో ఎగుమతులు 30 నుంచి 40 శాతం వరకు తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విదేశాలకు వెళ్లాల్సిన దాదాపు 7 వేల టన్నుల మామిడి ఇప్పుడు స్థానిక మార్కెట్లకే మళ్లుతోంది. అటు ఉత్తర భారతంలోని పంజాబ్, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అక్కడికి మామిడి ఎగుమతులు జరగడం లేదు. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లలో నిల్వలు ఒక్కసారిగా పేరుకుపోయి ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. ప్రస్తుతం టన్ను మామిడి ధర రూ.35 వేల నుంచి రూ.55 వేల మధ్య ఉండగా, సీజన్లో ఇది రూ.20 వేలకే పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరిగిన పెట్టుబడులు, రవాణా, కార్మిక వ్యయాలతో పోలిస్తే ఈ ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావని నష్టాలే మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు.. నాణ్యత లేమి ఈ ఏడాది మామిడి పూత బాగా వచ్చినా, కాత రాలేదు. పూత దశలో వాతావరణం సహకరించలేదు. ఉష్ణోగ్రతల మార్పులు, ఆకాల వర్షాలు, గాలివానల ప్రభావంతో పండ్ల నాణ్యత దెబ్బతింది. ఎగుమతులకు అవసరమైన ఏ-గ్రేడ్ మామిడి పరిమాణం తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో బయోస్టిములెంట్ వినియోగంతో పూత ముందుగానే వచ్చినా, హార్మోన్ అసమతుల్యత వల్ల కాయధారణ తగ్గినట్లు రైతులు చెబుతున్నారు.
ఎగుమతులపై యుద్ధ ప్రభావం.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల మామిడి విదేశాలకు ఎగుమతి అవుతుండగా, ఇందులో దాదాపు 10 వేల టన్నులు యూఏఈకే వెళ్తాయి. అయితే ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు హరుజ్ జలసంధి పరిణామాలు వాణిజ్య రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రెంటికీ చెడ్డ రేవడిలా రైతు పరిస్థితి..ఒక వైపు దిగుబడి తగ్గుదల, మరోవైపు మార్కెట్ సంక్షోభం. ఈ రెండింటి మధ్య మామిడి రైతులు చిక్కుకుపోయారు.
ఎగుమతులు నిలిచిపోవడంతో వచ్చిన ఒత్తిడి, దేశీయ మార్కెట్లో ధరల పతనం కలిపి రైతుల పరిస్థితిని దయనీయంగా మారింది. ప్రభుత్వ సహాయం, ఎగుమతుల ప్రోత్సాహం, నిల్వ సదుపాయాల పెంపు లేకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో వచ్చే నాణ్యమైన పండ్లు కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆలోపే విక్రయించాలనే ఆత్రుతతో రైతులు ఒకేసారి మార్కెట్కు పంటను తరలిస్తున్నారు. ఫలితంగా సరఫరా పెరిగి ధరలు మరింత క్షీణిస్తున్నాయి. ప్రభుత్వపరంగా ఎగుమతుల ప్రోత్సాహం, గిట్టుబాటు ధర కల్పించకపోతే మామిడి రైతు ఈ ఏడాది భారీ నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంలో సరిపడా కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు లేకపోవడం రైతులకు శాపంగా మారింది.
