భక్తుల ప్రయాణం సులభతరం చేసే ప్రణాళిక
భక్తుల ప్రయాణం సులభతరం చేసే ప్రణాళిక
హైదరాబాద్, ఆంధ్రప్రభ: నల్లమల అడవులు దాటి… ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ… సాగే శ్రీశైలం ప్రయాణం మరింత మధురానుభూతులను మిగల్చాలంటే ఇంకా ఏదో కావాలి. అందుకోసమే ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ పుణ్య క్షేత్రానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే భక్తులకు ప్రయాణ దూరం, ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి కాకతీయల రాజుల కాలం నుంచి దండుబాటుగా ప్రసిద్ధి చెందింది. అనంతరం ఛత్రపతి శివాజీ హైదరాబాద్‌లో విడిది చేసిన అనంతరం శ్రీశైలం వెళ్లనున్న సందర్భంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం దండుబాటును విస్తరించినట్లు చరిత్ర చెబుతున్నది. ఆ తర్వాత ఇదే బాటను భారత ప్రభుత్వం జాతీయ రహదారిగా తీర్చి దిద్దింది. అయితే లింగాల కూడలి నుంచి శ్రీశైలం పుణ్య క్షేత్రానికి దట్టమైన అడవుల నుంచి ఇరుకైన కొండల మీదుగా మూలమలుపులతో చేస్తున్న ప్రయాణం కాలక్రమేణ ప్రమాదంగా మారింది.
భక్తులు అత్యధిక సంఖ్యలో శ్రీశైలం వెళ్లుతుండటంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింపించింది. సిద్ధమైన డీపీఆర్శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటంతో, వాహన రద్దీ కూడా ఎక్కువైంది. దీనికి అనుగుణంగా హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు పెద్దఎత్తున అటవీ భూములు అవసరమవడంతో అది సాధ్యం కావడంలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. కీలకమైన అటవీ ప్రాంతంలో 86.74 కి.మీ. మేర వంతెనపై వెళ్లే హైవే (ఎలివేటెడ్ కారిడార్) నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. తద్వారా వన్యప్రాణులకు ఇబ్బంది ఉండదని, వాహన రాకపోకలు వేగంగా సాగుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రాజెక్ట్ ప్రతిపాదన ఇలా… హైదరాబాద్ నుంచి వచ్చే మార్గంలో బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరలోని కృష్ణా నది వద్ద తెలంగాణ, ఏపీ సరిహద్దు పరిధి 63.5 కి.మీ. వరకు ఉంది. ఈ ప్రాంతాల్లో నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో తెలంగాణ పరిధిలోని 45.35 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది.
కృష్ణా నదిపై ఐకానిక్ వంతెనకు ప్రతిపాదనలు కృష్ణా నదిపై ప్రస్తుతం ఉన్న వంతెనకు, డ్యాంకు మధ్యలో 450 మీటర్ల పొడవునా కొత్తగా ఐకానిక్ వంతెన నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు. శ్రీశైలం క్రాస్ రోడ్ వద్ద నుంచి ఆలయం వరకు 4.33 కి.మీ. మేర అనుసంధాన రోడ్ నిర్మించేందుకు ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ వాటాగా రూ. 8వేల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రభుత్వం సమర్పించింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్రం సరిహద్దు రాష్ట్రం, శ్రీశైలం దేవస్థానం కొలువుతీరిన ఏపీ సూచనలు తెలపాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనలకు అటవీశాఖ, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. వన్య ప్రాణుల సంరక్షణ దృష్ట్యా కారిడార్ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో భక్తుల ప్రయాణ భారం తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
