వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…

వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…

స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహో బిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమ య్యాయి. సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామివారి ఆలయంలో అభిషేకం, వివిధ పుష్పాలతో, ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు, మహా మంగళహారతి కార్యక్ర మాలను నిర్వహించారు. మండలంలోని ఆమిద్యాల గ్రామంలోని పెన్నా ఓబులేసు ఆలయం నుండి స్వామివారి ఉత్సవ మూర్తులను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు.

స్వామివారి ఉత్సవ మూర్తులు పెన్నా హోబిలంలోని దేవాలయం వద్దకు సాయంత్రం చేరాయి. దీనితో దేవాలయ ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగాటి నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు స్వామివారికి స్వాగతం పలికారు. భాజా భజంత్రీల నడుమ స్వామి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.

అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉభయ దాతలు అనంతపురం పట్టణానికి చెందిన కీర్తిశేషులు శ్రీనివాసులు వారి భార్య శోభారాణి వీరి కుమారులు స్వస్తి వాచనం, రక్షాబంధనం, కలశస్థాపన, మహా మంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బొల్లినేని పద్మాక్షి, దెబ్బల మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇందిరమ్మ, బోయ ఎర్రమ్మ, చావలి బాయి, మీనుగా రామకృష్ణ, ధనుంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, మంగళ చిన్న నారాయణప్ప, ఇంద్రావతి సుధాకర్, ఓబులేసు, అర్చకులు మయూరం బాలాజీ చార్యులు, గుండురావు తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉరవకొండ అర్బన్ సిఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడులు దేవస్థానాన్ని ప్రత్యక్షంగా దర్శించి సమగ్ర పరిశీలించారు. దేవస్థానం ఆవరణంలో భద్రత ఏర్పాట్లపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. భక్తుల రాకపోకులను సునీచ్చితంగా సాఫీగా నిర్వహించుటకు క్యూలైన్ల పటిష్టతను పరిశీలించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సీసీ కెమెరాలు సమగ్ర అమరికపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతలను కట్టదిట్టంగా నిర్వహించుటకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.