China | కొట్టుకుపోయిన కార్లు

China | కొట్టుకుపోయిన కార్లు
China | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారతదేశంలో ఎండలు మండిపోతుండగా, పొరుగున ఉన్న చైనాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని గ్వాంగ్జీ ప్రావీన్స్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు, వాహనాలు నీట మునిగిపోయాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్వాంగ్జీ ప్రావీన్స్లోని క్విన్జో ప్రాంతంలో సోమవారం కేవలం ఎనిమిది గంటల్లోనే 273 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అందులో ఒకే గంటలో 160 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు వెల్లడించారు. ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో పాఠశాలలు, కాలేజీలను మూసివేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి.
తీవ్రమైన వేడి కారణంగా వాతావరణంలో తేమ పెరగడం, హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కడం వల్ల దక్షిణ చైనాలో ఈ భారీ వర్షాలు కురిశాయని అధికారులు చెబుతున్నారు. తేమ ఒక్కసారిగా వర్షరూపంలోకి మారడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇదిలా ఉంటే భారతదేశంలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటుండగా, మధ్యాహ్నం భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉక్కపోత, చెమటతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు వరదలు రెండు దేశాల్లో భిన్న వాతావరణ పరిస్థితులను చూపిస్తున్నాయి.
