జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి…

జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి…

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంటనే తేవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి ని అత్యంత కిరాతకంగా హత్య చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వి.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి ని మంగళవారం రౌడీషీటర్ మరికొందరితో కలిసి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చావా రవి మాట్లాడుతూ శ్రీ గంధం మాఫియా పై వరుస కథనాలు రాయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ని హత్య చేశారన్నారు. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తున్న వ్యక్తిని అందరూ చూస్తుండగానే హత్య చేయడం నేరస్తుల తెగింపునకు అద్దం పడుతోంది అన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతోపాటు వెనకున్న శక్తుల పాత్ర పై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణమే తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐ.జె.యు కౌన్సిల్ సభ్యులు ఎస్. కె బాబు మాట్లాడుతూ ఇలాంటి దాడుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి అన్నారు. అనేక సందర్భాల్లో ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసినట్లు జర్నలిస్టు రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు,సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నాయకులు నారాయణ, సాంబశివరావు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ నాయకులు శ్రీనివాస్ కుమార్, రఘురాం, యం.వి సుబ్బారావు, ఆకుల తిరుమలరావు, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ ఉదయ్ భాస్కర్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply