కో ఆప్షన్ అర్హుల జాబితా నేడే..!
కో ఆప్షన్ అర్హుల జాబితా నేడే..!
- మే తొలివారంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం
- అభ్యర్థుల ఖరారు లో ఆలస్యం
- చేతులెత్తే పద్దతిలో ఎన్నిక..?
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కో ఆప్షన్ 4 స్థానాలకు సంబంధించి 16 దరఖాస్తులు దాఖలైన విషయం విదితమే. 3 రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన నిర్వహించగా నేడు అర్హులైన అభ్యర్థుల జాబితాను మున్సిపల్ కమిషనర్ ప్రకటించనున్నారు. దరఖాస్తుల చివరి గడువు రోజే 4 కో ఆప్షన్ పదవులకు గాను మహ్మద్ అలీ, ఎం డి పర్వీన్ సుల్తానా, ఎడ్ల శ్రీనివాస్, అంబటి కవిత లను కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తూ మెజారిటీ కౌన్సిలర్లు (9 మంది) తెల్ల కాగితాల పై సంతకం చేసి ఆ నలుగురిని దరఖాస్తు చేసుకోమంటూ సంకేతాలు (ఫోన్ చేసి చెప్పినట్లు) ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ దరఖాస్తుల చివరి గడువు రోజు దాటిన మరుసటి రోజు కొంత మంది కౌన్సిలర్లు ఎలాంటి సమిష్టి నిర్ణయం కాలేదని, మే నెల తొలి వారంలో జరిగే ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో చేతులెత్తే పద్ధతిలో పోటీలో ఉన్న, తమకు నచ్చిన వారికే మద్దతు ఇచ్చి మెజారిటీ తీర్మానం మేరకు కో ఆప్షన్ సభ్యులను కౌన్సిలర్లు ఎన్నుకోనున్నట్లు తెలిసింది.
గతంలో కో ఆప్షన్ లకు ఇంత రసాభాస లేదు..!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలి మున్సిపల్ పాలకవర్గం లో 4 కో ఆప్షన్ స్థానాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్ కను సన్నల్లోనే కో ఆప్షన్ పదవులకు దరఖాస్తులు చేసుకోవడం, నేరుగా ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం చేయడం చడీ చప్పుడు లేకుండా జరిగిందని… ప్రస్తుతం నోటిఫికేషన్ వేసింది మొదలు ఆర్భాట ప్రచారం చేస్తున్నారే తప్పా.. కనీసం పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించడంలో ఆలస్యం వహిస్తున్నారని, అభ్యర్థుల ఖరారులో ఎందుకు ఎమ్మెల్యే సామెల్ సమిష్టి నిర్ణయం తీసుకోవడం లేదని ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీలోనే నాయకులు, కార్యకర్తల ఆవేదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిల్ ఇప్పటికైనా నాన్చుడు ధోరణిలో కాకుండా నామినేటెడ్ పోస్ట్ ల ఎంపిక లో ఏకాభిప్రాయంకి వచ్చి అభ్యర్థులను ఖరారు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
