వకుళామాత సన్నిధిలో అక్షర గోవిందం
– టీటీడీ విన్నూత్న ధార్మిక కార్యక్రమం
– జులై 3 నుంచి అనునిత్యం అక్షరాభ్యాసం
తిరుపతి రాయలసీమ బ్యూరో : ఆంధ్రప్రభ : సనాతన సంప్రదాయాలను పరిరక్షించి భావి తరాలకు అందించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) అక్షర గోవిందం అనే విన్నూత్న కార్యక్రమానికి శ్రీ కారం చుట్టనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా జులై 3 వ తేదీ నుంచి తిరుపతి నగర శివార్లలోని పేరూరు వద్ద ఉన్న వకుళమాత గుడిలో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. చిన్నారుల్లో సనాతన ధర్మ సంప్రదాయాలపై ఆసక్తి పెంపొందించి, వారి విద్యారంభం, జీవితారంభం దైవానుగ్రహంతో శుభప్రదంగా సాగాలనే ఈ అక్షర గోవిందం అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించినట్టు టీటీడీ ప్రకటించింది తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా “అక్షర గోవిందం”, అన్నప్రాశన కార్యక్రమాలను ప్రారంభించనుంది.
జులై 3 వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 12.30 గంటల వరకు చిన్నారులకు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కార్యక్రమం అనంతరం ఆశీర్వచనం, ప్రసాదం, ప్రత్యేక “అక్షర గోవిందం కిట్” అందజేస్తారు. ఈ కార్యక్రమంలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొనవచ్చును. అక్షర గోవిందం కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష తదితర పూజా, విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తారు అదేవిధంగా ఆలయ అర్చకుల పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల మధ్య చిన్నారులకు తొలి అన్నప్రాశనను ఆగమోక్తంగా నిర్వహించి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల ఆశీస్సులను అందజేస్తారు.
3వ తేదీ నుంచి మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో రెండు బ్యాచ్ లు గా రోజుకు 50 మంది చిన్నారులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి టి టి డి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు గంట ముందస్తుగా ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలి. చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టిటిడి సూచించింది.
