AI in Medicine | వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం
AI in Medicine | వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం
AI in Medicine | ఏఐపై అధిక ఆధారపడటం వల్ల నైపుణ్యాల క్షీణత?
రోగుల నిర్ణయాల్లోనూ పెరుగుతున్న ఏఐ ప్రభావం
సాంకేతికతతో పాటు వైద్యుల స్వీయ నైపుణ్యాలు ఎందుకు కీలకం?
AI in Medicine | కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థల వినియోగం వైద్య రంగంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, వాటిపై అధికంగా ఆధారపడటం వల్ల తమ వృత్తి నైపుణ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన వైద్యుల్లో పెరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, 70 శాతం మంది నర్సులు, 77 శాతం మంది వైద్యులు కృత్రిమ మేధస్సుపై అతిగా ఆధారపడటం వల్ల తమ నైపుణ్యాలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ ఆందోళనకు బలం చేకూర్చే పరిశోధన ఫలితాలు కూడా ఇటీవల వెలువడుతున్నాయి. 2025లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, పెద్దప్రేగు పరీక్షల సమయంలో కణితులను గుర్తించేందుకు కృత్రిమ మేధస్సు సహాయాన్ని వినియోగించిన వైద్యులు, అదే సహాయం లేకుండా పరీక్షలు నిర్వహించినప్పుడు కణితులను గుర్తించే సామర్థ్యంలో తగ్గుదల కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ పరిశోధనలో కృత్రిమ మేధస్సు వినియోగానికి ముందు మూడు నెలల కాలంలో నిర్వహించిన పరీక్షల్లో వైద్యులు 28.4 శాతం కేసుల్లో కనీసం ఒక కణితిని గుర్తించారు. అయితే కృత్రిమ మేధస్సు సహాయం అందుబాటులోకి వచ్చిన తరువాత, అదే వైద్యులు ఆ సాంకేతిక సహాయం లేకుండా నిర్వహించిన పరీక్షల్లో ఈ గుర్తింపు శాతం 22.4కు పడిపోయింది. అంటే కణితుల గుర్తింపు సామర్థ్యం ఆరు శాతం పాయింట్లు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వైద్యులందరూ తమ వృత్తి జీవితంలో కనీసం రెండు వేలకుపైగా పెద్దప్రేగు పరీక్షలు నిర్వహించిన అనుభవం కలిగినవారే కావడం విశేషం. అంటే అనుభవజ్ఞులైన వైద్యుల్లో కూడా కృత్రిమ మేధస్సుపై ఆధారపడటం ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతోంది. 2025లో రోజువారీగా కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్న వైద్యుల శాతం 10 మాత్రమే ఉండగా, 2026 నాటికి అది 38 శాతానికి చేరింది. అదే కాలంలో నర్సుల్లో ఈ వినియోగం 16 శాతం నుంచి 32 శాతానికి పెరిగింది.
అయితే ఈ పెరుగుతున్న వినియోగం ఒక విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేధస్సు సహాయంతో పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ, గతంలో స్వయంగా చేయగలిగిన పనులను ఇప్పుడు దాని సహాయం లేకుండా చేయడంలో కొంత సామర్థ్య హ్రాసం కనిపిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితినే పరిశోధకులు “నైపుణ్యాల క్షీణత”గా అభివర్ణిస్తున్నారు. ఒక పనిని ఎంత ఎక్కువగా బయటి వ్యవస్థలకు అప్పగిస్తే, ఆ పనిని స్వయంగా నిర్వహించే సామర్థ్యం అంతగా తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.
2026లో నిర్వహించిన మరో అధ్యయనంలో కూడా ఇదే అంశం వెల్లడైంది. పూర్తిగా కృత్రిమ మేధస్సుకు పనులను అప్పగించిన ఉద్యోగులు తమ పనులను వేగంగా పూర్తి చేసినప్పటికీ, ఆ ప్రక్రియలో కొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించినదైనా, దాని ప్రభావాలు వైద్య రంగానికీ వర్తించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంలో నిర్ణయాల ప్రభావం నేరుగా మానవ ప్రాణాలపై పడుతుండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే సర్వేలో ఒక సానుకూల అంశం కూడా వెలుగుచూసింది. 77 శాతం మంది వైద్యులు కృత్రిమ మేధస్సు ఇచ్చే సమాధానాలను నేరుగా నమ్మకుండా, వాటిని విశ్వసనీయ వైద్య సమాచార వనరులతో సరిపోల్చి పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రీయ పరిశోధనల డేటాబేస్‌లు, ప్రామాణిక వైద్య సమాచార వేదికలను ఆధారంగా తీసుకుని వారు కృత్రిమ మేధస్సు సూచనలను ధృవీకరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది.
మరోవైపు రోగులే కృత్రిమ మేధస్సు వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం సగానికి పైగా రోగులు వైద్యులను కలిసే ముందు తమ వ్యాధుల గురించి, మందుల దుష్ప్రభావాల గురించి కృత్రిమ మేధస్సు ద్వారా సమాచారం సేకరిస్తున్నారు.
దాదాపు 60 శాతం మంది రోగులు, కృత్రిమ మేధస్సు ద్వారా తాము సేకరించిన సమాచారాన్ని తమ వైద్యులు పరిశీలించి దానిపై చర్చిస్తున్నారని తెలిపారు. అలాగే 56 శాతం మంది వైద్యులు, రోగులు తీసుకువచ్చే ఈ సమాచారాన్ని పరిశీలించి, అది శాస్త్రీయ ఆధారాలతో కూడిన వైద్య సమాచారానికి ఎంతవరకు అనుగుణంగా ఉందో వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే, ఆ సమాచారం తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉందని రోగులకు స్పష్టంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు.
దీంతో వైద్యుల గదులు క్రమంగా చికిత్స కేంద్రాలే కాకుండా, కృత్రిమ మేధస్సు అందించిన సమాచారాన్ని నిజానిజాలు నిర్ధారించే వేదికలుగా మారుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ కృత్రిమ మేధస్సు ప్రజల్లో ఆరోగ్య అవగాహనను పెంచడంలో సానుకూల పాత్ర పోషిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగులు, వైద్యులు ఇద్దరిలోనూ 70 శాతం మంది కృత్రిమ మేధస్సు ఆరోగ్య సంబంధిత అవగాహనను పెంచుతోందని, ఆరోగ్య సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తోందని అంగీకరించారు.
అయితే దీనికి తగిన నియంత్రణ వ్యవస్థలు లేకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ నైపుణ్యాలను స్వయంగా కొనసాగించాలి, ఏ పనులను కృత్రిమ మేధస్సుకు అప్పగించాలి అనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఈ పరిస్థితి ఉందనే అవగాహన కలగడం కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం కొనసాగించాలని భావించే నైపుణ్యాలు ఏవి, కృత్రిమ మేధస్సుకు అప్పగించగల పనులు ఏవి అనే అంశాలపై ఆలోచించడానికి ఇది దోహదపడుతుంది” అని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయానికి చెందిన సమాచార శాస్త్రవేత్త కెవిన్ క్రౌస్టన్ వ్యాఖ్యానించారు.
– థెరెస్ సుదీప్ (@Sudeep Theres)
